Saturday, May 4, 2024

RIP – మక్తల్ మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి మృతి – దుఖఃసాగరంలో అభిమాన జ‌నం

మక్తల్, జూన్ 13(ప్రభన్యూస్) తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున హైదరాబాదులోని ఎఐజి ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్న దయాకర్ రెడ్డి తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తోపాటు చంద్రబాబు నాయుడు తో మంచి అనుబంధం ఉండేది. మక్తల్ ఎమ్మెల్యే కన్నా ముందు ఆయన రెండుసార్లు అమరచిత నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. మొదటగా 1994 అసెంబ్లీ ఎన్నికల్లో అమరచింత నియోజకవర్గ నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో కాలుమొపారు. అనంతరం 1999 ఎన్నికల్లోను రెండోసారి అమరచింత ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2002 స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సతీమణి సీతా దయాకర్ రెడ్డి జెడ్పిటిసిగా పోటీ చేయించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ జెడ్పిటిసి స్థానాలు గెలుపొందడంతో ఆమె జడ్పీ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు.

2002 నుండి 2006 వరకు జెడ్పి చైర్పర్సన్ గా సీతా దయాకర్ రెడ్డి పని చేశారు. అనంతరం 2009 అసెంబ్లీ ఎన్నికల్లో దయాకర్ రెడ్డి మక్తల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయగా ఆయన సతీమణి సీతా దయాకర్ రెడ్డి దేవరకద్ర నియోజకవర్గం నుండి పోటీ చేసి ఇద్దరు ఘనవిజయం సాధించి భార్యాభర్తలు అసెంబ్లీలో అడుగు పెట్టారు. అనేక అభివృద్ధి పనుల్లో తమదైన ముద్ర వేసుకున్న దయాకర్ రెడ్డి ఎంతోమంది నాయకులు కార్యకర్తలను సొంత కుటుంబ సభ్యులుగా చెరగని ముద్ర వేసుకున్నారు.

అనంతరం 2014 ఎన్నికల్లో మక్తల్ నుండి పోటీచేసిన దయాకర్ రెడ్డి ఓటమి చెందగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తెదేపా మధ్య పొత్తు కుదరడంతో ఈసారి దయాకర్ రెడ్డి తెదేపా అభ్యర్థిగా పోటీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా పార్టీ బలహీనపడడం తెరాస గాలి వేస్తుండడంతో రెండోసారి మక్తల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఓటమి చెందినప్పటికి ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ క్యాడర్ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర పార్టీలో చేరినప్పటికీ మక్తల్ నియోజకవర్గం లో కాపాడుకుంటూ వచ్చారు.

అయితే తన అనుచరులంతా పార్టీ మారాలంటూ తీవ్రమైన ఒత్తిడి చిన్నప్పటికి ఏమాత్రం వెనకడుగు వేయకుండా తెదేపాల్లో కొనసాగుతూ తన రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. ఇక ఆ పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదన్న తన అభిమానుల అభిప్రాయాలను మన్నించి తెదేపాకు అధినేత చంద్రబాబు నాయుడుతో విస్తృతంగా చర్చించిన అనంతరం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రంగా నియోజకవర్గంలో తిరుగుతున్నప్పటికీ ఆయన అనుచరులు మాత్రం అధికార పార్టీలోకి వెళ్లకుండా ఆయన వెన్నంటే ఇప్పటిదాకా ఉన్నారు.

- Advertisement -

2023 ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయడం ఖాయమని ఏ పార్టీ నుండి పోటీ చేసేది అవసరమైన సమయంలో ప్రకటిస్తానని గత ఆగస్టు నెలలో జరిగిన ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా పార్టీ అభిమానుల మధ్య ప్రకటించారు .అనంతరం గత కొంతకాలంగా అనారోగ్యానికి గురికావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు .చివరకు మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్లోని ఏఐజి ఆసుపత్రిలో తుదిశ్వాస వదిలారు .ఆయన మరణంతో ఆయన అభిమానులు తీవ్ర విషాదం నెలకొంది. కొత్తకోట దయాకర్ రెడ్డి మరణం పట్ల పార్టీలకు అతీతంగా బి ఆర్ ఎస్ ,భాజపా ,కాంగ్రెస్ పార్టీల నాయకులు తీవ్ర సంతపాన్ని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement