Monday, April 29, 2024

భార్య పదవి, భర్త పెత్తనం.. ఇష్టమున్నట్టు కూల్చివేతల‌తో ఆగ్ర‌హం!

షాద్ నగర్ (ప్రభ న్యూస్) : రంగారెడ్డి జిల్లా షాద్‌న‌గ‌ర్‌లో ఓ మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధి భ‌ర్త హ‌వా సాగిస్తున్నాడు. త‌న భార్య ప‌ద‌విని అడ్డంపెట్టుకుని ఇష్ట‌మున్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో ప‌ట్ట‌ణంలో చాలా మంది ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో కూల్చి వేత‌ల విష‌యంలో ఇష్ట‌మున్న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ పెద్ద‌ల‌కు కంప్లెయింట్ చేయ‌డానికి రెడీ అయ్యారు. షాద్ నగర్ పట్టణంలోని 25వ వార్డు మహిళా కౌన్సిలర్ మాధురి ఇలాఖాలో రోడ్డు విస్తరణ సందర్భంగా బస్తీ వాసుల మధ్య లొల్లి మొదలైంది. అందరికీ సమన్యాయం చేయాల్సిన కౌన్సిలర్ అక్కడ కూల్చివేతల సందర్భంగా లేకపోవడం, ఆమె భర్త నందకిషోర్ తనకు ఇష్టం వచ్చినట్టుగా కొందరి కట్టడాలు కూలగొట్టడం.. మరికొందరిని వదిలేయడంపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

25వ వార్డులో గల పద్మావతి కాలనీలోని గల్లీలో సిసి రోడ్డు నిర్మాణం కోసం రోడ్డును విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా కౌన్సిలర్ భర్త నందకిషోర్ అక్రమ పెత్తనం చేస్తున్నారని బస్తివాసి లక్కాకుల రమేష్ కుమార్ ఆక్షేపణ వ్యక్తం చేశారు. కొందరికి ఒకలా మరికొందరికి మరోలా విస్తరణ పనుల్లో కట్టడాలు కూలగొట్టారని ఆరోపించారు. అదేవిధంగా మాధురి నందకిషోర్ కు సంబంధించిన వాసవి ప్రింటర్స్ భవనం పక్కన మాత్రం కూల్చకుండా అలాగే వదిలి పెట్టారని ఒకరికి ఒకలా న్యాయం, మరొకరికి మరోలా న్యాయం చేయడం ఎందుకని, అయినప్పటికీ 20 ఫీట్ల గల్లీలో కొందరివి కావాలని ఎక్కువగా కట్టడాలు కూలగొట్టారని ఇది ఎంతవరకు సమంజసం అని బస్తివాసి రమేష్ కుమార్ ప్రశ్నించారు.

అదేవిధంగా గల్లీలో ఇంత పనులు జరుగుతున్నప్పటికీ అధికారులు ఎక్కడ ఉన్నారో చెప్పాలని అన్నారు. మహిళా కౌన్సిలర్ మాధురి లేకుండా ఆమే భర్త మాత్రం ఇక్కడ పెత్తనం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అసలు మహిళా కౌన్సిలర్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఆమె ఎక్కడో ఉంటే ఆమె భర్త పెత్తనం ఇక్కడ ఏమిటని మరి కొందరు బస్తివాసులు పత్రికా ముఖంగా ప్రశ్నిస్తున్నారు. అధికారులు పాలకవర్గం మహిళా కౌన్సిలర్ల భర్తలకు ఏదైనా ప్రత్యేక చట్టం ఇచ్చారా? అంటూ ఆయన ప్రశ్నించారు. అధికారులు వెంటనే స్పందించాలని ఉన్నఫలంగా నిబంధనల ప్రకారం ఎలా ఉంటే అలా కూల్చివేతలు చేపట్టాలని మహిళా కౌన్సిలర్ భర్తకు ఇష్టానుసారంగా వ్యవహరించడం తగదని చెప్పారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement