Saturday, March 2, 2024

TS: రాహుల్ లీడర్ కాదు రీడర్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, నవంబర్ 1 (ప్రభ న్యూస్) : కేసీఆర్ ది కుటుంబ పాలన అని రాహుల్ గాంధీ పదేపదే ప్రస్తావించడానికి ముందు తన కుటుంబ పాలన గురించి తెలుసుకొని మాట్లాడాలని మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాహుల్ మాటలను ఖండిస్తూ మంత్రి మహబూబ్ న‌గర్ పట్టణంలోని న్యూ టౌన్ చౌరస్తాలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… అసలు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ కు ఉన్న అర్హత ఏంటి అని ప్రశ్నించారు. నెహ్రు, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, తన కుటుంబ సభ్యులా కాదా అని తీవ్రస్థాయిలో రాహుల్ పై ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని కేవలం రీడర్ మాత్రమేనని మంత్రి విమర్శించారు. ఎన్నికల సందర్భంగా హెలికాప్టర్లలో తెలంగాణకు వచ్చి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని అడుక్కుంటున్న కాంగ్రెస్ నాయకులు 11సార్లు అవకాశం ఇస్తే ఏం ఉద్దరించారని ప్రశ్నించారు. తలాపున కృష్ణ, తుంగభద్ర లాంటి నదులు ప్రవహిస్తున్న పాలమూరుకు త్రాగు, సాగునీరు ఇవ్వకుండా కుట్ర చేసింది కాంగ్రెస్ కాదా అని విమర్శించారు. పాలమూరు ప్రజల గొంతు ఎండిపోతున్నా పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రకు నీళ్లు తరలించిన విషయం వాస్తవం కాదా అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో ఇటు రాష్ట్రంలో ఆటు దేశంలో ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాహుల్ భారత్ జోడో యాత్ర పేరుతో ఆ రాష్ట్రాల్లో ప్రచారానికి కూడా వెళ్లే సాహసం చేయలేదని, ఈ విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

బోఫోర్స్ లాంటి కుంభకోణాలను భాజపా తెరపైకి తీసుకొస్తుందనే భయంతోనే రాహుల్ బీజేపీ పాలిత రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదన్నారు. నక్సలైట్లు, సాయుధ పోరాటం, ఉద్యమాల పేరుతో కాంగ్రెస్ పార్టీ వేల మంది ప్రాణాలను బలిగొన్నది నిజం కాదా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని, ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ భుజాలపై పార్టీని మోస్తున్న బ‌డుగు, బలహీన వర్గాలను కిరాయి సర్వేల పేరుతో పక్కకు నెట్టి నిన్న మొన్న వచ్చిన వారికి టికెట్లు కేటాయించడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో అగ్రకులాలకు ఉన్న విలువ బడుగు, బలహీన వర్గాల వారికి లేదని, బీఆర్ఎస్ పార్టీలో అన్నివర్గాల వారిని సమాంతరంగా చూసి అందరికీ సమన్యాయం చేస్తున్నది కేసీఆర్ అని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో ఉన్నాయని, కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో పొర్లు దండాలు పెట్టిన అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే జీర్ణించుకోలేని కొంతమంది కాంగ్రెస్, భాజపా నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు.

కాంగ్రెస్, భాజపాలకు ఢిల్లీ నాయకులు అధిష్టానం అయితే, బీఆర్ఎస్ కు గల్లీలోని ప్రజలే హై కమాండ్ అన్నారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ నేతృత్వంలో ప్రజా ఆశీర్వాదంతో కూడా తామే అధికారంలోకి రానున్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, గ్రంధాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కూడా చైర్మన్ వెంకన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సి.భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ కాలనీల కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement