Monday, April 29, 2024

Ponnam demand – కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరపాలి

హుస్నాబాద్, అక్టోబర్ 24 (ప్రభన్యూస్): పిల్లర్లకు బాంబులు పెడితే బ్లాస్ట్ కావాలి కానీ… కుంగిపోతాయా అని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పిల్లర్లు కుంగిపోవడంవ పట్ల జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఇంజనీయర్లు, సాంకేతిక నిపుణుల సూచనలు, సలహాలు తీసుకోకుండా ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిందని చెప్పారు.

సీఎం కేసీఆర్ అవినీతి అక్రమాలకు పాల్పడేందుకు ప్రాజెక్టులతో రాష్ట్ర ప్రజాధనం వృధా చేసిండని మండిపడ్డారు. కేసీఆర్ గొప్పలు చెప్పుకునే కాలేశ్వరం ప్రాజెక్టు మోటర్లు నీటమునగడం, బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం మూడునాళ్ళ ముచ్చటగానే ముగిసిందని, ప్రభుత్వం చేసే ప్రతి పనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు బ్యారేజీ కూలిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి వల్లే కుంగిపోయిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందన్నారు. ఇప్పటికైనా నిపుణుల కమిటీ వేసి ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ, బుధవారం జర్నలిస్టులు, మేధావులు, రైతులు, అఖిలపక్ష నేతలతో కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించబోతున్నట్లు ప్రభాకర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి, డీసీసీ కార్యదర్శి చిత్తారి రవీందర్, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు చిత్తారి పద్మ, వల్లపు రాజు, ఎంసీసీ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, బంక చందు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement