ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. ఈ సమావేశంలో భాగంగా తుమ్మల, పొంగులేటి సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ తుమ్మలను పొంగులేటి ఆహ్వానించారని సమాచారం.
భేటీ అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎంపీకి సీటు ఇవ్వలేదన్నారు. ఈ క్రమంలోనే తుమ్మలకు పాలేరు టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమన్న పొంగులేటి ఇద్దరం కలిసి పని చేద్దామని చెప్పారు. ఇందులో బేషజాలు ఏమీ లేవని పేర్కొన్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తుమ్మలను కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించిన విషయం విధితమే.