Thursday, April 18, 2024

Warangal: పొగాకు ఉత్పత్తుల డెన్‌పై పోలీసుల దాడి.. 1.35 ల‌క్ష‌ల సొత్తు స్వాధీనం

వరంగల్ క్రైమ్, (ప్రభ న్యూస్): గుట్కా, పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై వరంగల్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గుట్కా ఫ్రీ సిటీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓరుగల్లులో కొందరు వ్యాపారులు ఈజీ ఎర్న్ కోసం పోలీసుల కళ్లు గప్పి అక్రమ దందా చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. నిందితుల నుంచి 1.35 లక్షల‌ విలువైన‌ పొగాకు ఉత్పత్తుల నిల్వలను పట్టుకున్నారు. అక్రమార్జనకు అలవాటు పడ్డ ఇద్దరు గుట్కా స్మగ్లర్లు పట్టుబడగా, మరొకరు పరారయ్యారు.

టాస్క్ ఫోర్స్ ఇన్‌చార్జి, వరంగల్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ వైభవ్ గైక్వాడ్ తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. వరంగల్ నగరం కాశిబుగ్గలోని తిలక్ రోడ్డులో ముగ్గురు గుట్కా స్మగ్లర్లు పెద్ద ఎత్తున పొగాకు ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నారు. వారి డెన్ లో భద్రపర్చుకొన్నట్లు సమాచారం అందింది. అర్ధరాత్రి దాటాక దిగుమతి చేసుకోవడం, తెల్లవారు జామున విక్రయిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు రెక్కీ వేసి, శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు.

తిలక్ రోడ్డులోని బింగి రాము ఇంటిపై టాస్క్ ఫోర్స్, ఇంతేజార్ గంజ్ పోలీసులు దాడి చేశారు. 218 ప్యాకెట్ల అంబర్, 132 ప్యాకెట్ల జేకే, 46 ప్యాకెట్ల బ్లాక్ బాబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాన్ షాప్ యజమాని బింగి రాము (39), కాశిబుగ్గ వ్యాపార వేత్త గుండా కృష్ణ (31)ను అరెస్ట్ చేశారు. కాశిబుగ్గకు చెందిన టెక్నీషియన్ సామల అరవింద్ పరారీలో ఉన్నాడు. ఇంతేజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement