Sunday, June 16, 2024

TS: నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పై పోలీసులు కొరడా

సిరిసిల్ల, ప్రభన్యూస్ : నకిలీ వీసాలు ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వెళ్ళే వారిని మోసం చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా మోసాలకు పాల్పడుతున్న నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

- Advertisement -

నకిలీ ఏజెంట్ లపై మూడు కేసులు నమోదు చేశామని ఆదివారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండలం సారంపెళ్లి గ్రామానికి చెందిన మహమ్మద్ మహబూబ్ (53), రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బొండు అంజయ్య (55), గంభీరావుపేట్ మండలం నిర్మాల గ్రామానికి చెందిన ఓరగంటి రాములు (39) లపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ గల్ఫ్ ఎజెంట్స్ విజిట్ వీసాల పై జిల్లాలో ఉన్న నిరుద్యోగులని టార్గెట్ చేసి వారి నుండి అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని మాయ మాటలు చెప్పి ఇక్కడి నుండి గల్ఫ్ దేశాలకి పంపిస్తారన్నారు.

అక్కడికి అప్పులు చేసి వెళ్లిన తరువాత కంపనీ వీసా కాదని తెలిసి దేశం కానీ దేశంలో ఏమి చేయాలో తెలియక అష్ట కష్టాలు పడి స్వదేశానికి తిరుగు ప్రయాణం అవడం లేదా అక్కడే ఏదో చిన్న చితక కూలి పని చేసుకోవడం వంటివి జరుగుతున్నాయని, అయితే ఎవరైతే ఏజెన్సీల లేదా ఏజెంట్ల చేతిలో మోసపోయారో వారు నేరుగా పోలిసులకు పిర్యాదు చేస్తే ఆ పిర్యాదు పై తగిన రీతిలో విచారణ జరిపి నేరం రుజువు అయితే సదరు ఏజెంట్ పై కేసు నమోదు చేయడం జరుగుతుందని, జిల్లాలో గత సంవత్సరం 43 కేసులు, ఈ సంవత్సరం 19 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. నకిలీ వీసాలు ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వెళ్ళే వారిని మోసం చేస్తే సదరు ఏజెన్సీల రద్దు కు సిఫారసు చేయడం తో పాటు వారి ఫై పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుందన్నారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వెల్లేవారు నకిలి ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దని, జిల్లాలో ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు లైసెన్స్ కలిగి ఉన్న ఏజెంట్లను మాత్రమే ఆశ్రయించి, వారి ద్వారానే వీసాలు పొందవలసిందిగా సూచించారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు లైసెన్స్ గల ఏజెంట్ల వివరాలు తెలుసుకునేందుకు పోలీస్ శాఖను సంప్రదించవచ్చని సూచించారు. జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన, విదేశాలకు పంపిస్తామని డబ్బులు తీసుకొని, పాస్ పోర్ట్ తూసుకోని పంపకుండా మోసం చేసిన, నకిలీ గల్ఫ్ ఏజెంట్ల కి సంబంధించిన సమాచారం ఉంటే సమాచారం అందించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement