Wednesday, April 17, 2024

Open Letter – కాంగ్రెస్ గెలుస్తుంద‌నే భ‌యంతోనే మోడీ, కెసిఆర్ ల ప్రొద్బ‌లంతో ఈడీ, ఐటి దాడులుః రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్ది ఈడీ, ఐటీ దాడులు పెరుగుతున్నాయని అమిత్ షా కేసీఆర్ కలిసి ప్రణాళిక రచిస్తే పియూష్ గోయల్, కేటీఆర్ కలిసి అమలు చేస్తున్నారని ఆరోపించారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి..
బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయని కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ కలిసి రాజ్యాంగ బద్ద వ్యవస్థలను సైతం రాజకీయ క్రీడలో పావులుగా మార్చి వేశారని ధ్వజమెత్తారు. ఈ మేర‌కు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు.. ఈ రెండు పార్టీలలో చేరిన వాళ్లు పవిత్రులు, ఇతర పార్టీల వారు ద్రోహులా? అని ప్రశ్నించారు.

దేశంలో, రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదని. ప్రజల తరపున ప్రశ్నించే గొంతులు మిగలకూడదనేది బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ అని ఆరోపించారు. వీళ్లు తమ కుట్రలు, కక్షలతో చివరకు ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని సైతం వేధిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గడిచిన నెల రోజులుగా కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్‌గా ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయని వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివో? ఈ సోదాల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్ది ఈడీ, ఐటీ దాడులు పెరుగుతున్నాయని అమిత్ షా కేసీఆర్ కలిసి ప్రణాళిక రచిస్తే పియూష్ గోయల్, కేటీఆర్ కలిసి అమలు చేస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడుతున్న దర్యాప్తు సంస్థలకు కేసీఆర్ చేసిన అవినీతి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇళ్లు, కార్యాలయాల వైపు కన్నెత్తి కూడా చూడవని, కేసీఆర్‌కు వందల కోట్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తులు జోలికి వెళ్లడం లేదని, కాళేశ్వరం అవినీతి బట్టబయలైతే కేసీఆర్‌ను ప్రశ్నించడం లేదన్నారు. కానీ కాంగ్రెస్ నేతలైన పొంగులేటి, కేఎల్ఆర్, తుమ్మల, వివేక్ ఇళ్లు, కార్యాలయాలపై మాత్రం విరుచుకుపడుతున్నాయన్నారు. మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు కాంగ్రెస్‌లో చేరగానే కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్‌ల క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లిందని ఇక మీ పతనం మొదలైందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మీ కవ్వింపు చర్యలు కాంగ్రెస్ కార్యకర్తల్లో మరింత కసి పెంచాయని కచ్చితంగా బీజేపీ, బీఆర్ఎస్ ఉమ్మడి కుట్రలను ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement