Saturday, May 11, 2024

TS | త్వ‌ర‌లోనే నామినేటెడ్‌ పోస్టుల భర్తీ..! మొదటి విడతలో 20 మంది వరకు ఛాన్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నామినేటెడ్‌ పదవుల కోసం ఎప్పుడెప్పుడా..? అని ఎదురు చూస్తున్న ఆశావాహులకు త్వరలోనే తీపి కబురు అందనుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 18 నుంచి 20 మంది పార్టీ కీలక నేతలకు మొదటి విడతలో అవకాశం దక్కుతుందని, రెండొ విడతలో ఈ నెలాఖరులో మరో 30 నుంచి 40 మందికి నామినేటెడ్‌ పదవులు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.

పదవులు పంపకంలో సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అన్ని వర్గాలకు ప్రాధాన్యత దక్కే విధంగా కసరత్తు పూర్తి చేశారని తెలిసింది. అందులో ఇటీవల జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో టికెట్‌ దక్కని వారు, పార్టీ విజయం కోసం కీలకంగా పని చేసిన వారికి చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్‌ పదవులకు సంబంధించి పార్లమెంట్‌ నియోజక వర్గాల వారిగా ఒక్కో అసెంబ్లి నియోజక వర్గం నుంచి సుమారుగా నాలుగు నుంచి ఐదుగురి పేర్లను తెప్పించుకున్నట్లుగా సమాచారం.

త్వరలోనే వీటికి సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా వారి పేర్లకు ఆమోద ముద్ర వేయడంతో పాటు జాబితాను కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి పంపించినట్లు సమాచారం. ఇప్పటికే పార్టీకి చెందిన నలుగురు సీనియర్లకు ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన సీఎం రేవంత్‌రెడ్డి కేబెనెట్‌ హోదాను కూడా కల్పించారు. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖకు సలహాదారుగా మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, ప్రొటోకాల్‌, పబ్లిక్‌ రిలేషన్‌ సలహాదారుగా హర్కర వేణుగోపాల్‌, ఢిల్లిలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎంపీ మల్లు రవికి సీఎం రేవంత్‌రెడ్డి అవకాశం కల్పించారు.

వీరిలో ఒక షబ్బీర్‌అలీ తప్పా మిగతా ముగ్గురు నాయకులు ఇటీవల జరిగిన అసెంబ్లిd ఎన్నికల్లో పోటికి దూరంగా ఉన్నారు. ఇక ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీలుగా పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌కు అవకాశం ఇచ్చారు. ఈ ఇద్దరు నేతలకు కూడా పార్టీ అధిష్టానం టికెట్‌ ఇవ్వలేదు. అయినప్పటికి పార్టీ విజయం కోసం చాలా మంది నాయకులు పని చేశారు.

- Advertisement -

కాగా, అసెంబ్లి ఎన్నికల్లో టికెట్‌ కోసం ఒక్కో నియోజక వర్గం నుంచి పదుల సంఖ్యలో పోటీ పడ్డారు. నియోజక వర్గంలో ప్రజా బలం ఉన్న నాయకులను పార్టీ పెద్దలు బుజ్జగించి.. అధికారంలోకి వచ్చాక నామినేటెడ్‌ పదవులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ అనుబంధ సంఘాల నేతలు కూడా డజన్‌ మంది వరకు టికెట్‌ ఆశించినా.. ఒక మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలికి తప్ప.. మిగతా వారికి ఎవరికి కూడా టికెట్‌ ఇవ్వలేదు. నామినేటెడ్‌ పోస్టుల్లో పార్టీ అనుబంధ విభాగాలకు చెందిన కొందరికి అవకాశం వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో మిగతా నాయకుతు కూడా పదవులు వస్తాయనే ఆశతో ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement