Friday, May 3, 2024

NZB: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. సీపీ కల్మేశ్వర్

నిజామాబాద్ సిటీ, 12(ఫిబ్రవరి ప్రభ న్యూస్): జిల్లాలో కిడ్నాప్ చేస్తున్నారని, అనుమానితులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సూచించారు. చిన్న పిల్లలను ఎత్తుకెల్లే ముఠా నిజామాబాద్ జిల్లాలో తిరుగుతున్నారనే అపోహలను ప్రజలు నమ్మవద్దని కోరారు. కిడ్నాప్ చేస్తున్నారని అనుమానిస్తూ… అనుమానితులపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల నుంచి అనుమానాస్పద కిడ్నాప్ కేసులు జరిగాయని, జరిగిన మూడు కిడ్నాప్ లలో పిల్లలను పట్టుకొని వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. ఈ ముగ్గురి కిడ్నాపర్లకు ఒకరికొకరు ఎల్లాంటి సంబంధం లేదని విచారణలో తేలిందన్నారు.

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో చిన్నారుల కిడ్నాప్ కేసులకు సంబంధించి ఇటీవల కాలంలో ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్, యూట్యూబ్, సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అనుమానితుల వీడియో ను తీసి సోషల్ మీడియాలో కిడ్నాపర్లుగా చిత్రీకరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నట్లు తెలిపారు. అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ హెచ్చరించారు. జిల్లాలో కిడ్నాప్ చేస్తున్నారంటూ అనుమానితులపై దాడి చేసిన 15ఘటనలు జరిగాయన్నారు. ఈ ఘటనలకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.

- Advertisement -

గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే సంబంధిత పోలీ స్ స్టేషన్ కు గాని, డయల్ 100, పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. గాయత్రి నగర్ లో సోమవారం ఓ వ్యక్తిని అనుమానిస్తూ సదరు వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారని వెల్ల డించారు. ఈ ఘటనలో సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడని పేర్కొన్నారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. జిల్లాలో ఎలాంటి కిడ్నాపర్లు లేరని, సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, ఒకవేళ అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేయాలని సీపీ కల్మేశ్వర్ తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ జయరాం, ట్రైనీ ఐపిఎస్ చైతన్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement