Tuesday, April 30, 2024

NZB: ట్రాన్స్ జెండర్లపై వస్తున్న పుకార్లు నమ్మొద్దు…

నిజామాబాద్ సిటీ, ఫిబ్రవరి 12 (ప్రభ న్యూస్): ట్రాన్స్ జెండర్లను కిడ్నాపర్లుగా చిత్రీకరిస్తూ కొందరు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని… పిల్లలను ఎత్తుకుపోతున్న వారమని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు అవాస్తవమని ట్రాన్స్ జెండర్స్ రక్ష, జరీనా, శ్యామల అన్నారు. సమాజంలో తాము కూడా మనుషులమేనని మమ్మల్ని గుర్తించాలని కోరారు. గత 15 రోజులుగా ఎక్కడికి వెళ్లినా తమను కిడ్నార్లుగా భావిస్తున్నారని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తాము పొట్టకూటి కోసం భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని, కానీ కొందరు తమను కిడ్నాపర్లు అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొ న్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నగరంలో ఉంటున్నామని, తాము పిల్లలకు, పెద్దలకు ఆశీర్వాదాలు ఇస్తమే తప్ప, వారికి ఎలాంటి హానీ చేయమని చెబుతున్నారు.

ఇటీవల తాము భిక్షాటన కోసం వెళితే, తమను కిడ్నాపర్లు అంటూ, సోషియల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేశారని, ఇది మంచి పద్ధతి కాదని, ఎవరైనా తప్పు చేస్తే పోలీసులకు అప్పజెప్పాలని, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. ఆర్మూర్, రుద్రూర్ లలో సోషల్ మీడియాలో తమపై కొందరు కావా లని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తమపై సమాజంలో ఇప్పటికే చిన్నచూపు ఉందని, ఇలాంటి పుకార్లు వదంతులు చేయడం వలన ప్రజలు తమను అసహించుకునే అవకాశం పెరుగుతుందని వాపో యారు. దయచేసి తమపై లేని పోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికీ తాము సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఎవ్వరూ ఉద్యోగాలు ఇవ్వక పోవడంతో బిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నామని, ఇలా పుకార్లు చేయడం వల్ల తమ బ్రతుకు ఆగమ్యగోచరంగా మారనుందని ఆవేదన వ్యక్తం చేశారు.


అందరి మేలు మాత్రమే కోరుకుంటామని, అడుక్కుని తిని బ్రతికే తమపై కావాలని కొందరు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. తమ అందరికీ ట్రాన్స్ జెండర్ గా గుర్తింపు కార్డులు ఉన్నాయన్నారు. ట్రాన్స్ జెండర్స్ కాని వారు ఎవరైనా తమ చుట్టుపక్కల కనిపిస్తే తామే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి వారిని అప్పగిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు అర్థం చేసుకొని అందరితో పాటు తాము బ్రతికేలా అవకాశం కల్పించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో హారతి, గంగా, ప్రియా, ప్రజ్ఞా, అలకనంద, తదితర ట్రాంజెండర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement