Wednesday, May 1, 2024

TS | ఆర్టీసీలో కొత్త చరిత్ర, సంస్థ ఇక ప్ర‌భుత్వ శాఖ‌.. కేబినెట్ నిర్ణ‌యం

నిజామాబాద్ : ఆర్టీసీ చరిత్రలో ఇదో అపూర్వ ఘట్టం.. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని నిర్ణయం….కలలో కూడా ఊహించని పరిణామం…చెప్పడానికి మాటలు చాలవు..ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచేదే. ఫలితంగా కార్మికుల సుధీర్ఘ పోరాటం ఫలించింది. ఎన్నో ఏళ్ల కల నెరవేరింది…ఊహించని వరం ఉద్యోగులకు దక్కింది… దీనితో కార్మికుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.. ఇక నుంచి తాము కార్మికులము కాదని ప్రభుత్వ ఉద్యోగులమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు… టీఎస్ ఆర్టీసీ కాస్తా సంస్థ నుంచి ప్రభుత్వ శాఖగా మారిందని సంతోష పడుతున్నారు.

ఇది పరిస్థితి:
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ వన్, నిజామాబాద్ టూ, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,475మంది ఆర్టీసీ కార్మికులు పని చేస్తున్నారు. ఆర్టీసీ ఆర్ఎం హోదా నుంచి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ వరకు ఉన్నారు. ఇప్పటి వరకు వీరంతా తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కింద అధికారులు, కార్మికులుగా పని చేస్తున్నారు.

లాభలెన్నో:
సీఎం కేసీఆర్ తాజా నిర్ణయంతో వీరందరు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారు. ఇక నుంచి జీతాలు సంస్థ నుంచి కాకుండా 010పద్దు కింద నేరుగా ప్రభుత్వమే చెల్లిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే, పీఆర్సీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు వర్తిస్తుంది. హోదా ప్రకారం జీతాలు పెరుగుతాయి. డీఏ, ఐఆర్, అలవేన్సులు లభిస్తాయి. సీసీఎల్ఏ రూల్స్ వర్తిస్తాయి. తద్వారా ఉద్యోగ భద్రతతో పాటు, ఇతర లాభాలు జరుగుతాయి.

పోరుబాట ఆర్టీసీ నైజం:
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పోరు బాట పట్టారు. సకల జనుల సమ్మెలో నిర్బంధాలను కాదని, బస్సు చక్రం కదల్చలేదు. బంద్ అంటే బస్సులు నడపకపోవడం అనేలా ఉండేది. రాష్ట్రం వచ్చాక ఉహించని పీఆర్సీ వచ్చింది. తదనాతరం డిమాండ్ల సాధనకు మళ్ళీ ఆర్టీసీ కార్మికులు నిరసన బాట పట్టారు. సీఎం కేసీఆర్ కన్నెర్ర చేసి, కార్మికులపై ఉక్కుపాదం మోపారు. ఎస్మా చట్టం ప్రయోగానికి వెనుకాడ లేదు. సంఘాల వల్లనే నష్టం జరుగుతుందని, కార్మిక సంఘాలకు గుర్తింపు లేకుండా చేశారు. దీంతో కార్మికులు రెండు వర్గాలుగా విడిపోయి, సమ్మె విరమించారు. ఇలాంటి పరిస్థితుల్లో తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం కార్మికుల్లో అమితమైన సంతోషాన్ని నింపుతోంది. చరిత్రలో నిలిచే నిర్ణయంగా కార్మికులు భావిస్తున్నారు.

ఎమ్మెల్యే బాజిరెడ్డి పాత్ర:
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించడంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే , ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పాత్ర ఉంది. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయ సమయంలో మన జిల్లా ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ గా ఉండటం విశేషం. దీంతో జిల్లా కార్మికుల్లో ఆనందం రెట్టింపు అవుతోంది. చరిత్రలో గోవర్ధన్ పేరు సైతం నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాజిరెడ్డి హయాంలో ఆర్టీసీ అభివృద్ధి చెందుతుందని, సీఎం కేసీఆర్ నమ్మకాన్ని ఆయన నిలబెట్టారని కార్మికులు పొగుడుతున్నారు.

- Advertisement -

చారిత్రాత్మక నిర్ణయం:
…జానారెడ్డి, నిజామాబాద్ రీజినల్ మేనేజర్
ఇదో చారిత్రాత్మక నిర్ణయం. ముఖ్యమంత్రి కేసీఆర్ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం చరిత్రలో నిలిచే విషయం. దేశ చరిత్రలోనే గొప్ప నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తీసుకున్నారు. ఆయనకు జీవితాంతం కార్మికులు రుణపడి ఉంటారు. తాజా నిర్ణయంతో మేమంతా అమితమైన సంతోషంతో ఉన్నాం. మా అందరి తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలుతెలియజేస్తున్నాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement