Sunday, February 18, 2024

రానున్న ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టుల పొత్తు కీలకం.. గుత్తా సుఖేందర్ రెడ్డి

….. మంత్రి జగదీష్ రెడ్డికి నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు.

….. మంత్రి ఆహ్వానం మేరకే కుటుంబ సమేతంగా పుట్టినరోజు వేడుకలకు హాజరు.

….. కొంత మంది పార్టీలో గ్రూపులు సృష్టించి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు.

….. దానికి నిదర్శనమే చండూరు, మర్రిగూడ , నారాయణపురం ఎంపీపీ లపై అవిశ్వాస తీర్మానం.

….. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే అమిత్ రెడ్డి పోటీ చేస్తాడు.

….. మీడియాతో చిట్ చాట్ లో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

నల్లగొండ, ప్రభ న్యూస్ ప్రతినిధి : రాష్ట్రానికి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టుల పొత్తు కీలకం కానుందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ… జిల్లా మంత్రి జగదీష్ రెడ్డికి తనకు మధ్య విభేదాలు ఉన్నాయన్న వాదనలను ఆయన నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. అసలు తనకు మంత్రికి మధ్య విభేదాలు వచ్చే ఛాన్సే లేదన్నారు. మంత్రి ఆహ్వానం మేరకే తాను కుటుంబ సమేతంగా మంత్రి పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యానని ఆయన స్పష్టం చేశారు. అంతే కాకుండా గుత్తా అమిత్ రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై స్పష్టతనిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే అమిత్ రెడ్డి ఎన్నికల బరిలో ఉంటాడని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో భాగంగా తమకు అనుకూలమైన వారిని తమ ప్రాంతాలకు బదిలీ చేయించుకోవాలనే పట్టుదలలే జిల్లాలో నేతల మధ్య విభేదాలు రావడానికి ప్రధాన కారణమని చెప్పుకొచ్చారు. కానీ తాను శాసన మండలి ఛైర్మన్ గా ఎన్నికై నాలుగేళ్లు అవుతున్నా.. ఇప్పటి వరకు తాను అలాంటి వ్యవహారాల్లో ఏనాడూ జోక్యం చేసుకోలేదని అంటూనే సీఎం కేసీఆర్ వద్ద సైతం తాను జిల్లాకు సంబంధించిన ప్రజోపయోగమైన‌ సమస్యలపై మాత్రమే చర్చిస్తాను తప్ప మరే ఇతర పైరవీల గురించి మాట్లాడే అలవాటు తనకు లేదని స్పష్టం చేశారు.

తాను రాజకీయాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తున్న కారణంగానే తనకు జిల్లా మంత్రికి విభేదాలు తలెత్తే అవకాశమే లేదని ఆయన నొక్కి వక్కాణించారు. అంతే కాకుండా జిల్లాలో కొంత మంది అధికార పార్టీ నేతలు తమ ఒంటెద్దు పోకడలతో పార్టీలో గ్రూపులు సృష్టించి, గ్రూపు తగాదాలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని పరోక్షంగా ఆయన మునుగోడు శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఎండగట్టారు. దానికి నిలువెత్తు నిదర్శనమే చండూరు, మర్రిగూడ, నారాయణపురం ఎంపీపీ లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement