Tuesday, April 30, 2024

భూ నిర్వాసితులకు అండగా ప్రభుత్వం… పైళ్ల శేఖర్ రెడ్డి

ప్రభన్యూస్, ప్రతినిధి / యాదాద్రి : నృసింహ సాగర్(బస్వాపూర్ రిజర్వాయర్) ముంపు గ్రామం బిఎన్ తిమ్మాపూర్ భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణ కేంద్రంలో పునరావాసం క్రింద ఇళ్ల స్థలాల పట్టాలను అందజేసారు. నృసింహ సాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామం బిఎన్ తిమ్మాపూర్ గ్రామస్థులకు భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో హుస్నాబాద్ లో కేటాయించిన స్థలాలకు 1053 మంది ముంపు బాధితులకు ఇళ్ల స్థలాల పట్టాలను అందజేసారు. ఎంతో మంది రైతుల సాగు భూమి, తమ గ్రామాన్ని త్యాగం చేసిన బి.ఎన్ తిమ్మాపూర్ గ్రామస్థులకు మనందరం అండగా నిలవాల్సిన అవసరం ఉందని, వారి త్యాగం వల్లనే రిజర్వాయర్ నిర్మాణం సాధ్యమవుతుందని తెలియజేశారు.

గ్రామంలో నివసిస్తున్న 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులందరికీ ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశామన్నారు. మొత్తం 93ఎకరాల భూమిలో మౌలిక సదుపాయాలు కల్పించి ఇళ్ల స్థలాలకు కేటాయించామన్నారు. బి.ఎన్ తిమ్మాపూర్ ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వారి పెద్దకొడుకులా నిరంతరం వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల స్థలాలను కేటాయించినందుకు గ్రామస్థులందరూ ఎమ్మెల్యే పై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో భూపాల్ రెడ్డి, తహశీల్ధార్ వెంకట్ రెడ్డి, నాయకులు నరాల నిర్మల, బీరుమల్లయ్య, జడల అమరేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement