Wednesday, May 1, 2024

TS : పొద్దుతిరుగుడు పంట‌ల‌ను కొనుగోలు చేయాలి… సీఎంకు హ‌రీష్‌రావు లేఖ‌..

సీఎం రేవంత్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు లేఖ రాశారు. పొద్దు తిరుగుడు పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కోరారు. 25 శాతం మాత్రమే కేంద్రం కొంటుందని మిగతా 75 శాతం రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాల్లోని 20,829 ఎకరాల్లో ఈసారి రైతులు పొద్దు తిరుగుడు పువ్వు పంట పండించారు. ఈ పంటకు మార్కెట్లో కనీస మద్దతు ధర లభించడం లేదని నేను ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రభుత్వానికి లేఖ రాశాను.

దానికి స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మద్దతు ధర అయిన రూ.6,760 చెల్లించి పొద్దు తిరుగుడు పువ్వు పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దాని ప్రకారమే మార్కెట్లలో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే రైతుల నుంచి వచ్చిన మొత్తం దిగుబడిని కొనుగోలు చేయకుండా, కేవలం కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సేకరించాలనుకున్న మేరకే కొనుగోలు చేశారు. మిగతా పంటను ప్రస్తుతం కొనుగోలు చేయడం లేదు. దీంతో 75 శాతం పంటను రైతులు చాలా తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోవాల్సి వస్తున్నదని తెలిపారు.

రాష్ట్రంలో 1,65,800 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు పంట దిగుబడి వస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన నిధులతో కేవలం 37,300 క్వింటాళ్లు మాత్రమే కొనడానికి అంగీకరించింది. మార్కెట్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో, వారు నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం మాత్రమే సేకరణ జరిపారు. మొత్తం పంటలో కేవలం 25 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మిగతా 75 శాతం పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ రైతులు పండించిన చివరి గింజ వరకు మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు తెరిచి, పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను.

ఈ సారి కూడా రైతులు పండించిన చివరి గింజ వరకు కనీస మద్దతు ధర అయిన రూ.6,760 చెల్లించి పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చిన మేరకే కొనుగోలు చేసి, రాష్ట్ర ప్రభుత్వం తరుఫున కొనుగోలు చేయాల్సిన వాటా గురించి మౌనంగా ఉండడం రైతులను వంచించడమే అవుతుందని మీ దృష్టికి తెస్తున్నాను. ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు కేవలం నాలుగైదు వేలకే తమ పంట అమ్ముకుని నష్టపోవాల్సి వస్తున్నది. మీరే స్వయంగా జోక్యం చేసుకుని పొద్దు తిరుగుడు పువ్వు పంటను మొత్తం కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసి, రైతులు ఆదుకోవాలని కోరుతున్నాను

Advertisement

తాజా వార్తలు

Advertisement