Sunday, May 5, 2024

Murder – వృద్ధ భార్య శీలంపై అనుమానం – సుపారీ ఇచ్చి భ‌ర్త‌ను లేపేసిన స‌తీమ‌ణి …

సిరిసిల్లా – వృద్ధాప్యంలోకి చేరుకున్నా భర్త అనుమానించడం మానకపోవడం, పదే పదే కొట్టడంతో విసిగిపోయిన భార్య కఠిన నిర్ణయం తీసుకుంది. అరవై ఏళ్లు దాటిన తనను అనుమానించి వేధిస్తుండడంతో భర్తను హతమార్చాలని ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకుంది. భర్తను కడతేర్చినందుకు రూ.2 లక్షలు ఇస్తానని ఒప్పుకుంది. ఒప్పందం ప్రకారం అరవై ఐదేళ్ల వృద్ధుడిని చంపేసిన నిందితులు.. ఆ తతంగాన్నంతా వీడియో తీశారు. అవ్వ ఇచ్చిన రెండు లక్షలు ఖర్చు కాగానే మరో రూ. లక్ష ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జులై 13న జరిగిన ఈ హత్య తాజాగా వెలుగులోకి వచ్చింది.

సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి చెందిన కనకవ్వ, కాశయ్య దంపతులు పాతికేళ్ల క్రితం సిరిసిల్లకు వలస వెళ్లారు. సిరిసిల్ల మార్కెట్ లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కూతుళ్లకు పెళ్లిళ్లు కాగా కొడుకుకు మానసిక స్థితి బాగాలేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే, భార్య కనకవ్వను అనుమానిస్తూ కాశయ్య తరచూ కొడుతుండేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేని కనకవ్వ వరుసకు తమ్ముడయ్యే వ్యక్తికి చెప్పుకుని బాధపడింది.

భర్త కాశయ్యను చంపేస్తే రూ.2 లక్షలు ఇస్తానని చెప్పింది. దీంతో మరో వ్యక్తితో కలిసి కాశయ్యను చంపేశాడు. జులై 13న ఇంట్లో నిద్రిస్తున్న కాశయ్య గొంతు చుట్టూ దుప్పటి చుట్టి హత్య చేశారు. నిందితులలో ఒకరు ఇదంతా వీడియో తీశారు. మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి మానేరు వాగు చెక్ డ్యామ్ వద్ద బొందలగడ్డలో పూడ్చిపెట్టారు. కనకవ్వ ఇచ్చిన రూ.2 లక్షలు తీసుకుని వెళ్లి జల్సాలు చేశారు. డబ్బు మొత్తం ఖర్చవగానే తిరిగి వచ్చి కనకవ్వను బ్లాక్ మెయిల్ చేయసాగారు.

మరో లక్ష రూపాయలు ఇవ్వకుంటే వీడియో బయటపెడతామని బెదిరించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరడంతో కనకవ్వను, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో కాశయ్య హత్య విషయం బయటపడింది. తహసీల్దార్ సమక్షంలో బొందలగడ్డలో నుంచి కాశయ్య మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం కోసం పంపించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement