Friday, May 17, 2024

ప్రభుత్వ వ్యతిరేకతే మా ఆయుధం – తెలంగాణలో పోరాటంతోనే అధికారం – బీజేపీ నేత మురళీధర్ రావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తమ ఆయుధమని, పోరాటంతోనే అధికారం చేపడతామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి మురళీధర్ రావు స్పష్టం చేశారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో తెలంగాణతో పాటు దేశ రాజకీయాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ గురించి మాట్లాడుతూ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు వ్యవహారశైలిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకతకు ప్రాతినిథ్యం వహించేది భారతీయ జనతా పార్టీయేనని వ్యాఖ్యానించారు. పోరాటం చేసేవాళ్లను ప్రజలు గుర్తిస్తారని, ప్రస్తుతం ఆ గుర్తింపు బీజేపీకి దక్కుతోందని ఆయన తెలిపారు. అయితే క్షేత్రస్థాయి వరకు ఈ భావనను ప్రజల్లోకి తీసుకెళ్లగల్గితే అధికారం సుసాధ్యమేనని తెలిపారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో గతంలో బీజేపీ ఎన్నికల గుర్తు కమలం గురించి ప్రజలకు పూర్తి అవగాహన లేకపోయిందని, కానీ గత రెండు మూడేళ్లుగా బూత్ కమిటీలు (శక్తి కేంద్రాలు) వేసి పార్టీ చేస్తున్న కసరత్తుతో పాటు ‘ప్రజా సంగ్రామ యాత్ర’, ‘ప్రజా గోస – బీజేపీ భరోసా’, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ (వీధి సమావేశాలు) వంటి కార్యక్రమాలతో ‘కమలం’ గుర్తు జనంలోకి చొచ్చుకెళ్లిందని వెల్లడించారు. బీజేపీకి అభ్యర్థులు లేరన్న మాటను ఆయన కొట్టిపడేశారు. ప్రజా వ్యతిరేకతకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు నాయకులు ఉద్భవిస్తారని, ఇతర పార్టీల నుంచి కూడా వచ్చి చేరతారని ఆయన సూత్రీకరించారు. ఇప్పటికిప్పుడు పార్టీల్లో చేరికలు లేవంటే బీజేపీలో చేరడానికి ఎవరూ సిద్ధంగా లేరని అనుకోవద్దని, చాలా మంది నేతలు కమలనాథులతో మంతనాలు సాగిస్తున్నారని మురళీధర్ రావు అన్నారు. మరోవైపు ఏ పార్టీ అయినా తాము ఎదగాలని కోరుకుంటుందని, ఆ క్రమంలో ఆ పార్టీ పొందే ఓట్లు మరో పార్టీ ఓట్లను చీల్చినట్టుగా లెక్కగట్టడం సహజమని చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పై యుద్ధం చేస్తోందని, ఇందుకోసం కాంగ్రెస్ పార్టీతో పోటీపడుతోందని చెప్పారు. తాము ఎదిగే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఓటును చీల్చినంత మాత్రాన బీజేపీకి బీ-టీమ్‌ అంటూ ప్రచారం చేయడం తగదని అన్నారు. తొలినాళ్లలో తాము కాంగ్రెస్‌పై యుద్ధం చేస్తున్నప్పుడు సోషలిస్టు పార్టీలతో పోటీపడాల్సి వచ్చేదని, అప్పుడు కూడా ఇలాగే అనుకునేవారని గుర్తుచేశారు.

కేసీఆర్ కొండకు వెంట్రుక కట్టారు

భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కే. చంద్రశేఖర రావు ప్రయోగాలు చేస్తుంటారని మురళీధర్ రావు అన్నారు. ఆయన ఇప్పుడు కొండకు వెంట్రుక కట్టారని, వస్తే కొండ, పోతే వెంట్రుక అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. అయితే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా పేరు మార్చుకున్నంత వేగంగా జాతీయస్థాయిలో సంస్థాగతంగా బలోపేతమై, బీజేపీ వ్యతిరేక ఓటుతో ఎదుగుతుంది అనుకోవడం హాస్యాస్పదమని మురళీధర్ రావు వ్యాఖ్యానించారు. చరిత్రలో పార్టీ పెట్టిన అతి తక్కువ సమయంలో అధికారం సాధించిన సందర్భం ఏదైనా ఉంటే అది ఎన్టీ రామారావు తెలుగుదేశం పెట్టినప్పుడే జరిగిందని, కానీ అలాంటి ఉదాహరణలు ఎక్కువ లేవని అన్నారు. కేసీఆర్ కూడా ఎన్టీఆర్ తరహాలో చరిత్ర సృష్టించాలని అనుకుంటున్నారని, కానీ బీఆర్ఎస్ ప్రచారానికి తప్ప ఎన్నికల ఫ్యాక్టర్ కాబోదని అన్నారు. గతంలో తమిళనాడు మాజీ సీఎం జయలలిత కూడా ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తే ప్రధాని అయ్యే అవకాశం తనకు ఉంటుందని పరోక్షంగా జనంలోకి సంకేతాలు పంపించారని, అలా తమిళనాడులోని 39 సీట్లకు 37 గెలుచుకున్నారని ఉదహరించారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అలాగే సీట్లు పెంచుకుని, కేంద్రంలో ఎన్డీయే లేదా యూపీఏ కూటముల్లో ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోతే చక్రం తిప్పవచ్చని అనుకుంటున్నారని, కానీ కేసీఆర్ అనుకుంటున్నదేదీ జరగదని అన్నారు. బీజేపీ సంపూర్ణ మెజారిటీతో మళ్లీ అధికారం సాధించడం ఖాయమని చెప్పారు.

పార్టీలో గ్రూపులు లేవు… అందరి లక్ష్యం బీఆర్ఎస్ ఓటమే

తెలంగాణ బీజేపీలో గ్రూపులు, అంతర్గత విబేధాలు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని మురళీధర్ రావు కొట్టిపడేశారు. పార్టీలో ముందు నుంచి ఉన్నవాళ్లతో పాటు కొత్తగా చేరినవాళ్లు చేసేది బీఆర్ఎస్ వ్యతిరేక పోరాటమేనని, అందరి లక్ష్యం బీఆర్ఎస్‌ను ఓడించమేనని తెలిపారు. ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు గ్రూపులు కట్టే పరిస్థితి ఉండదని చెప్పారు. బీఆర్ఎస్ వ్యతిరేక పోరాటంలో అన్నింటినీ సమన్వయం చేయగలిగే శక్తి బీజేపీ అధినాయకత్వానికి ఉందని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని, జనంలోకి ఇప్పటికే ఆ సందేశం వెళ్లిందని అంచనా వేశారు. ఇకపోతే పార్టీ గెలుపొందడానికి ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందే ప్రకటించాల్సిన అవసరం లేదని, అన్ని చోట్లా సీఎం అభ్యర్థే గెలుపు వ్యూహం కాదని, హర్యానాలో పార్టీ గెలుపొందే వరకు మనోహర్ లాల్ ఖట్టర్ గురించి బయట ఎవరికీ పెద్దగా తెలియదని ఉదహరించారు. తెలంగాణలో సీఎం పదవిని ఆశిస్తున్న బీజేపీ నేతలు ఉదాహరణకు 10 మంది ఉన్నారనుకుంటే, వారందరూ ముందు కలిసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, అప్పుడే ఆ పది మందిలో ఒకరు కచ్చితంగా సీఎం అవుతారని మురళీధర్ రావు అన్నారు. ఆ లెక్కన పది మందిలో ప్రతి ఒక్కరికి సీఎం అయ్యే ఛాన్స్ 1/10 వంతు ఉంటుందని, పార్టీని అధికారంలోకి తీసుకురాకపోతే ఏ ఒక్కరికీ ఆ ఛాన్స్ దక్కదని అన్నారు. ప్రస్తుతం ఇదే సూత్రం ఆధారంగా నేతలందరూ పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు.

- Advertisement -

అదానీ వ్యవహారం ‘మరక’ కాదు.. కేసీఆర్ తప్పిదాలు మాకు తెలుసు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా నిష్కల్మషమైన అవినీతి రహిత రాజకీయాలకు మారుపేరు అని మురళీధర్ రావు అన్నారు. అదానీ – హిండెన్‌బర్గ్ విషయంలో ఎంత దుష్ప్రచారం చేసినా ఆ ప్రభావం ప్రధానిపై ఉండబోదని తెలిపారు. సాంకేతికంగా ప్రభుత్వం అదానీకి ఎలాంటి లబ్ది చేకూర్చలేదని, ఆ సంస్థకు రుణాలిచ్చిన ఎల్ఐసీ లేదా బ్యాంకులు సైతం తమ నిబంధనల ప్రకారమే ఇచ్చాయని చెప్పారు. ప్రతిపక్షాల ప్రచారం ప్రజల్లోకి వెళ్లడం లేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు తప్పిదాలు, అవినీతి, అక్రమాలు, దాచిపెట్టిన రహస్యాలు అన్నీ తమకు తెలుసని మురళీధర్ రావు అన్నారు. సరైన సమయంలో వాటన్నింటినీ బయటకు తీస్తామని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement