Monday, April 29, 2024

TS: ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి అమ్మకానికి పెట్టిన మోడీ… జీవన్ రెడ్డి

మోడీ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేసి, అమ్మకానికి పెట్టారని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షుడు అడ్లురీ లక్ష్మణ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏవి, నిరుపేదల అక్కౌంట్లలో 15 లక్షలు ఏవని ప్రశ్నించారు. ధరల పెరుగుదలకు మోడీ పాలన కారణం కాదా.. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలే దేశంలో పునరావృతం అవుతాయన్నారు. తెలంగాణలో బీజేపీ అకౌంట్ కూడా ఓపెన్ కాదన్నారు. జగిత్యాలలో మోడీ ప్రసంగం దేశ భవిషత్ ప్రణాళిక వివరించాల్సి ఉండగా, నిస్తేజంగా ఉందన్నారు. నిర్మాణాత్మకంగా ఉంటదని భావిస్తే స్పష్టత లోపించిందన్నారు. ప్రధాని బాధ్యత రాహిత్యంగా మాట్లాడారని విమర్శించారు. దశాబ్ద కాలంగా మోడీ పాలన సాగించారు.. ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయ రంగంపై మోడీ వ్యాఖ్యలు విస్తుగొలిపాయన్నారు..

రైతుల అభివృద్ది మాట దేవుడెరుగు.. వ్యవసాయానికి పెట్టుబడి రెండింతలు పెరిగిందన్నారు.. రాజకీయాలకు అతీతంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని ఉద్యమం సాగుతుంటే స్పందించడం లేదన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత లేకపోతే, అర్థమే వుండదన్నారు. వ్యవసాయానికి పెద్ద పీట వేసేందుకు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ భారీ ప్రాజెక్టులు నిర్మించారన్నారు. భారత ఆహార సంస్థ పంటలకు మద్దతు ధర కల్పించడంతో పాటు, వినియోగదారులకు ఆహార భద్రత కల్పించేందుకు ఏర్పాటు చేశామన్నారు. మద్దతు ధరకు చట్టబద్దత కల్పించకపోవడంతో పప్పు దినుసుల సాగుకు రైతులు మొగ్గు చూపడం లేదన్నారు. మూడు నల్ల చట్టాలను ఉపసంహరించాలని రైతులు ఉద్యమిస్తే, మోడీ వెనకడుగు వేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో వరి ధాన్యం మద్దతు ధర రూ.450 నుండి రూ.1300 లకు సుమారు 200శాత పెంచినమన్నారు. మోడీ పాలనలో వరి దాన్యం మద్దతు ధర రూ.1300 నుండి రూ.2300 కనీసం రెట్టింపు కూడా చేయలేదన్నారు. రైతు కూలీలకు ఉపాధి కల్పించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ ప్రారంభించిందన్నారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేసేలా 72 వేల కోట్ల నుండి 60 వేల కోట్లకు తగ్గించడం మోడీ ఆలోచన విధానం ఎలా ఉందో ఆలోచించాలన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలన్నారు. నిరుద్యోగ యువతకు చూపే ఉపాధి ఇదేనా.. అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. మోడీ రైతులను, మహిళలను, యువతను విస్మరించారన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం 2023 అక్టోబర్ లో జీఓ వెలువడింది..ఎక్కడ ఏర్పాటు చేస్తారు.. సభ్యులను నియమించలా వద్దా చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని ప్రశ్నించారు.

నిజామాబాద్ లో పసుపు సాగు 2019 లో 50 వేల ఎకరాల నుండి నేడు 19 వేల ఎకరాలకు తగ్గిందన్నారు. పసుపు సాగుతో గిట్టుబాటు కాక రైతులు సాగు చేయడం తగ్గించుకుంటున్నారు. నిజంగా రైతులను ఆదుకోవాలంటే పసుపు క్వింటాల్ కు మద్దతు ధర రు.15000 ఇస్తామని ప్రకటించాలన్నారు. 2019లో పసుపు బోర్డ్ ఏర్పాటు చేస్తామని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.. ఐదేళ్లు గడిచాయి..పసుపు బోర్డు ఏర్పాటు ఒక్క అడుగు ముందుకు పడలేదు.. షుగర్ ఫ్యాక్టరీ గురించి మోడీ మాట్లాడటం ఆశ్చర్యం కల్గిస్తుంది..నిన్నటి వరకు అధికారంలో ఎవరున్నారు.. ఖాయిల పడిన పరిశ్రమలు తెరిచే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉందన్నారు. 2001-2002 లో షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగిందన్నారు. అప్పుడు అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం, బిజెపి మిత్ర పక్షంగా ఉన్నది నిజం కాదా.. షుగర్ ఫ్యాక్టరీని బిజెపి ఎంపి కొనుగోలు చేశారు.. మోడీకి ఈ విషయం తెలుసా.. నిన్నటి వరకు బీఆర్ఎస్, బిజెపి ఆలాయ్ బలాయ్ తీసుకున్నయ్., షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం చేయాల్సిన బాధ్యత లేదా.. మోడీ పాలన రెండుసార్లు చూసిన ప్రజలు.. ఇక చాలు.. అంటున్నారు..

- Advertisement -

కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. చక్కర కర్మాగారం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి కేంద్ర ప్రభుత్వ బాధ్యత కాదా అని ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తించక పోవడంతో బీజేపీ అవినీతికి ఆస్కారం కల్పించిందన్నారు. కాళేశ్వరంపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ న్యాయ విచారణకు కమిటీ వేసిందన్నారు. న్యాయ వ్యవస్థపై మీకు విశ్వాసం ఉందా లేదా.. మోడీ చెప్పాలన్నారు. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ తో 40వేల కోట్ల భారం పడిందన్నారు. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం విద్యుత్ ప్రాజెక్టులు చేపడితే యాదాద్రి చేపట్టవలసిన అవసరం ఉండేది కాదు కదా అన్నారు. ఇంతకాలం కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు.. సుప్రీంకోర్టు అరెస్ట్ చేయవద్దని చెప్పలేదు.. చెబితే ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని అన్నారు. ఎవరినైనా వాడుకొని వదిలేయడం మోడీ నైజమన్నారు. ప్రజలు తెరచాటు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేసీఆర్ గారడీ చేసినట్టే మోడీ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. రజాకార్లతో కొట్లాడినప్పుడు నీ పార్టీ ఎక్కడ ఉన్నది.. మీరు ఎక్కడ ఉన్నారు.. పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు పెన్షన్ ఇచ్చి గౌరవించింది కాంగ్రెస్ పార్టీ అని, బీజేపీ నిజరూపం ప్రజలు గమనించాలని జీవన్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement