Tuesday, April 23, 2024

Breaking : వెంటాడిన మృత్యువు – ఎమ్మెల్యే లాస్య దుర్మరణం

ఓ ఆర్ఆర్​పై ఘోరం
యాక్సిడెంట్​ స్పాట్​లోనే డెడ్
కారు డ్రైవర్​, పీఏకు తీవ్రగాయాలు
నందిత మృతదేహం మార్చురీకి తరలింపు
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి.. సంతాపం
బీఆర్ఎస్​ శ్రేణుల్లోవిషాదం
కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరు
మూడు నెలల్లో లాస్యకు ఇది మూడో ప్రమాదం

(ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్​ ప్రతినిధి) – హైదరాబాద్​లోని ఓఆర్ఆర్​పై జరిగిన ఘోర ప్రమాదంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, కంటోన్మెంట్ ఎమ్మెల్యే జ్ఞాని లాస్య నందిత (37) దుర్మరణం చెందారు. పటాన్ చెరు ఓఆర్ఆర్​పై శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నందిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్​పై అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. దీంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పీఏ ఆకాశ్, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు లాస్య మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆమె మరణవార్తతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, శ్రేణులంతా షాక్ కు గురయ్యారు.

తండ్రి బాటలోనే…

గతేడాది ఫిబ్రవరి 19న లాస్య నందిత తండ్రి, బీఆర్ఎస్ నేత సాయన్న మరణించారు. ఆయన మృతిచెందిన ఏడాదికే లాస్య రోడ్డు ప్రమాదంలో చనిపోవడం కుటుంబ సభ్యులను శోక సంద్రంలోకి నెట్టేసింది. ఆమె వ్యక్తిగత జీవితంలో, రాజకీయాల్లో తండ్రే తన తొలి గురువు అని ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో లాస్య తెలిపారు. దివంగత ఎమ్మెల్యే జి.సాయన్న, గీత దంపతుల మొదటి కూతరు లాస్య నందిత. హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో జన్మించారు. కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేశారు. ఎమ్మెల్యే లాస్య నందితకు ఇద్దరు అక్కలు నమ్రతా, నివేదితా ఉన్నారు. లాస్య కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ చేసి.. తండ్రి బాటలో రాజకీయ వారసురాలిగా అడుగులు వేశారు. 2015లో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి పోటీ చేసిన లాస్య.. అతి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోగా.. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడీగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్​గా గెలిచారు. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్లీ ఓటమిని చూడక తప్పలేదు. తండ్రి సాయన్న మరణంతో.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్ఠానం కంటోన్మెంట్ టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో లాస్యనందిత మెజార్టీ ఓట్లతో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు.

వరుసగా ప్రమాద సూచనలు..

ఎమ్మెల్యే లాస్యను మృత్యువు వేటాడినట్టే వరుసగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మూడో సారి మృత్యు కౌగిట్లోకి చేరుకున్నారని అభిమానులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. చిరునవ్వులతో ఆప్యాయంగా పలకరించే లాస్య పదహారణాల తెలంగాణ ఆడబిడ్డగా వ్యవహరించేదని బీఆర్ఎస్​ అభిమానులు తెలిపారు. రెండు నెలల కిందటే తొలి ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డారు. సికింద్రాబాద్‌లో ఓ కార్యక్రమానికి వెళ్లగా.. ఆమె ఎక్కిన లిఫ్ట్‌ ఓవర్ లోడ్‌ కారణంగా అకస్మాత్తుగా పడిపోయింది. దాంతో లాస్య లిఫ్ట్‌లోనే ఇరుక్కుపోయారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది వెంటనే అప్రమత్తమై లిఫ్ట్‌ డోర్లు బద్దలు కొట్టారు. దాంతో సురక్షితంగా బయటకు వచ్చారు.

- Advertisement -

ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక..

ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ మధ్య సరిగ్గా పది రోజుల కిందల.. అంటే ఫిబ్రవరి 13న బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభకు హాజరైన లాస్య కారులో హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో నార్కట్‌పల్లి సమీపంలోని చర్లపల్లి చేరగానే కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. కేసీఆర్ సభ నేపథ్యంలో అద్దంకి.. నార్కట్ పల్లి రోడ్డుపై వాహనాల రాకపోకలను ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నారు. కారు వేగంగా ఢీకొట్టడంతో ఎమ్మెల్యే కారు పోలీసు సిబ్బందిపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న హోంగార్డు కిషోర్ ప్రాణాలు కోల్పోయారు. మరో హోంగార్డుకు గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు.. లాస్య నందిత, ఆమె పీఏ స్వల్పగాయాలతో బయటపడ్డారు. బీఆర్ఎస్ కార్యనిర్వహాక అధ్యక్షుడు కే.తారకరామారావు పరామర్శించారు. ఇప్పుడు అనూహ్య రీతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య ప్రాణాలను కోల్పోవటంతో కుటుంబ సభ్యుల్లోనూ, బీఆర్ఎస్​ శ్రేణుల్లోనూ విషాదచాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement