Thursday, May 2, 2024

వర్షానికి దెబ్బతిన్న రోడ్లు.. బహుజన పార్టీ ఆధ్వర్యంలో వరినాట్లు వేసి నిరసన

ఉమ్మడి మెదక్ బ్యూరో : కొండాపూర్ మండలం సైదాపూర్ లో వర్షానికి దెబ్బతిన్న రోడ్లపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. శుక్రవారం కొండాపూర్ మండల పరిధిలోని సైదాపూర్ రోడ్ ను బాగు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన సేన స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డప్పు రాజు ఆధ్వర్యంలో సైదాపూర్ -వికారాబాద్ రోడ్ పై సైదాపూర్ గ్రామస్తులు నాయకులతో కలిసి వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చినుకు పడితే చిత్తడిగా మారుతున్నా అధికారులు మాత్రం రోడ్డును బాగు చేయడం లేదని ఆరోపించారు. నిత్యం సంగారెడ్డి , వికారాబాద్ జిల్లా వాసులు, వాహనదారులు సదాశివపేట, వికారాబాద్ ప్రాంతాలకు ఈ రోడ్డుపైనే వెళ్లాల్సి ఉంటుందని రోడ్డు పూర్తిగా గుంతలు బురదమయంగా మారడంతో వాహనాలు వెళ్లే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు.

వర్షం పడిందంటే చాలు చీకటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రజలు ప్రయాణిస్తున్నారని, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఎన్నో ఏళ్ల నుండి రోడ్డు గుంతలు కంకర తేలి బురద మయమైనా ఇప్పటివరకు ప్రభుత్వం రోడ్డును బాగు చేసేందుకు ముందుకు రాకపోవడం లేదన్నారు. ఇది చూస్తుంటే బీఆర్ఎస్ పాలన గ్రామాల్లో అభివృద్ధి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అనంత సాగర్ మాజీ ఎంపీటీసీ ప్రకాశం, నాయకులు కరుణాకర్ గౌడ్, శ్రీనివాస్, దర్శన్ యాదవ్, మైపాల్, మోహీన్, అశోక్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement