Thursday, February 29, 2024

పల్లెల రూపురేఖలు మార్చే దిశగా శరవేగంగా అభివృద్ధి : ఎమ్మెల్యే జీఎంఆర్‌

గుమ్మడిదల, ప్రభ న్యూస్ : నియోజకవర్గానికి చిట్ట చివరన ఉన్నటువంటి ప్రతి పల్లె కూడా మౌలిక వసతులతో నిండుగా కనిపించే విధంగా ప్రజల ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రతి పల్లెను అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం గుమ్మడిదల మండలంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 3 కోట్ల 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మండల పరిధిలోని వీరన్న గూడెం, గుమ్మడిదల, కానుకుంట, అనంతారం, మంబాపూర్, కొత్తపల్లి, నల్లవల్లి గ్రామాలలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన, మరియు పూర్తయిన పనుల ప్రారంభోత్సవాలు చేశారు. ఆయా గ్రామాల్లో మహిళలు, యువకులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఏ ఎన్నిక వచ్చిన ప్రజలు నిండు మనస్సుతో బిఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతున్నారని వారి నమ్మకం వమ్ము చేయకుండా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడు గుర్రాల వలె పరుగెత్తిస్తున్నామని తెలిపారు.

ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, నూతన ప్రభుత్వ భవనాలు, అంగన్వాడి కేంద్రాలు, వైకుంఠధామాలు, బ్రిడ్జిలు, అంతర్గత రహదారులు, వీధి దీపాలు, క్రీడా ప్రాంగణాలు నిర్మించడంతోపాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, ముఖ్యమంత్రి సహాయనిధి, సంక్షేమ హాస్టళ్లు, ఓవర్సీస్ స్కాలర్షిప్ లు అందిస్తూ దేశానికే ఆదర్శంగా తెలంగాణ సంక్షేమ పథకాలు నిలుస్తున్నాయని అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు ప్రతిరోజు ప్రజలను తప్పుదోవ పట్టించేలా చవాకబారు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో వృద్ధులకు, వితంతు మహిళలకు 500 రూపాయల పెన్షన్ అందిస్తుంటే, తెలంగాణలో రెండు వేల రూపాయలు అందిస్తున్నామనీ, ప్రజలు ఈ తేడాను గమనించాలని కోరారు. రైతు ఆరుగాలం కష్టించి పండించిన ప్రతి పంటకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మెరుగైన మద్దతు ధర అందిస్తూ రైతు ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్నారని అన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సమయం ఆసన్నమైందని, ప్రతిపక్షాలు కల్లబొల్లి కబుర్లతో సాధ్యం కానీ హామీలు కురిపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తారని, ప్రతి ఇంటికి పెద్ద కొడుకు వలే పనిచేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కుమార్ గౌడ్, వైస్ ఎంపీపీ మంజుల వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు శ్రీనివాస్, మమతా వేణు, నరసింహారెడ్డి, హనుమంత్ రెడ్డి, ఆంజనేయులు, శంకర్ ఆయా గ్రామాల ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ హుస్సేన్, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement