Friday, May 3, 2024

KTR Encounter – గుజ‌రాత్ ను గుండెల్లో ఉంచుకుని… తెలంగాణ‌కు గున‌పం గుచ్చ‌డం భావ్య‌మా మోడీజీ….కెటిఆర్

హైద‌రాబాద్ – ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఇటీవల వరుసగా ట్విట్ట‌ర్ లో ప్ర‌శ్న‌లు సందిస్తున్న తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ మరోమారు ఎక్స్ వేదికగా పలు అంశాల‌పై మోడీని నిల‌దీశారు. ప్రధాని నేడు నిజామాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ.. తమ మూడు ప్రధాన హామీల సంగతేంటో చెప్పాలని నిలదీశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఎప్పుడు నిర్మిస్తారని, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎప్పుడు దక్కుతుందని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఎప్పుడు ప్రాణం పోస్తారని ప్రశ్నించారు. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి రాష్ట్రానికి వస్తున్నారని, మరి ఆ మూడు విభజన హక్కులకు దిక్కేదని నిలదీశారు.

పదేళ్లుగా పాతరేస్తూ ఎంతకాలం ఈ అబద్ధాల జాతరతో గడుపుతారని కేటీఆర్ ప్రశ్నించారు. మీ మనసు ఎప్పుడు కరుగుతుంది.. తెలంగాణ గోస ఎప్పుడు తీరుతుందని అని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్‌ను మాత్రం గుండెల్లో పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలు దింపడం భావ్యం కాదని అన్నారు. కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఊపిరి తీశారని, లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే ఐటీఐఆర్‌ను ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా దగాపడిన పాలమూరుకు ద్రోహం చేసి వెళ్లిపోయారని పేర్కొన్నారు. మోడీ పదేళ్ల పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజల్నే కాకుండా 140 కోట్ల భారతీయులను కూడా మోసం చేశారని నిప్పులు చెరిగారు. ఈ పదేళ్లలో అదానీకి తప్ప ఆమ్ ఆద్మీకి ఏమీ దక్కలేదని విమర్శించారు. తమకు ఇచ్చిన మూడు ప్రధాన హామీలను నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా అని, మళ్లీ వంద స్థానాల్లో డిపాజిట్ గల్లంతు కావడం గ్యారెంటీ అని కేటీఆర్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement