Friday, May 17, 2024

Delhi: కాళేశ్వరం కాస్ట్ మూడింతలు పెంచారు.. ఇదో పెద్ద కుంభకోణం, కేసీఆర్​ హస్తం ఉంది: కాగ్‌కు షర్మిల ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాళేశ్వరం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హస్తం ఉందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఢిల్లీ వచ్చిన ఆమె శుక్రవారం ఉదయం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గిరీష్ చంద్ర ముర్మును కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం పెరిగిందే గానీ ఆయకట్టు పెరగలేదని, అన్ని ప్యాకేజీల్లో అవినీతి జరిగిందని వివరించారు. అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. కాగ్‌కు కాళేశ్వరం అవినీతిపై అన్ని విషయాలు వెల్లడించానని తెలిపారు.

స్వతంత్రంగా దర్యాప్తు జరుపుతామని, ఇరిగేషన్ నిపుణులు, ఐఐటీ నిపుణులతో ప్రత్యేక బృందాన్ని నియమించి దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 38 వేల కోట్ల రూపాయలతో పూర్తి చేసి, 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకుంటే… కేసీఆర్ దాని వ్యయాన్ని లక్షా 20 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. ప్రాజెక్ట్ వ్యయం మూడింతలు పెరగ్గా, ఆయకట్టు మాత్రం కేవలం రెండు లక్షల ఎకరాలు మాత్రమే పెరిగిందని చెప్పుకొచ్చారు.

నాన్ ఎమ్‌పానెల్డ్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారని షర్మిల ధ్వజమెత్తారు. మెగా కంపెనీ ప్రతి ప్రాజెక్టులో అవినీతి ఉందని, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. BHEL నుంచి మోటర్లు కొన్న ధరకు, ప్రభుత్వం చూపించిన ధరకు భారీగా వ్యత్యాసం ఉందని ఆమె చెప్పారు. సీబీఐ దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాళేశ్వరం జాతీయ స్థాయి కుంభకోణం, దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని వివరించారు.

- Advertisement -

కేంద్ర సంస్థల నుంచి నిధులు తీసుకుని ప్రాజెక్టు కట్టారని, మిషన్ భగీరథ సహా తెలంగాణలో ప్రతి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని షర్మిల ధ్వజమెత్తారు. బ్యాంకుల నుంచి లక్ష కోట్లు అప్పులు తెచ్చారని, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 30 వేల కోట్లు తెచ్చారని షర్మిల ఆరోపించారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ నుంచి మరో 30 వేల కోట్ల అప్పు తెచ్చారని, నాబార్డ్ నుంచి 12 వేల కోట్లు తెచ్చారని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం నిర్మాణం అవినీతిని సీరియస్‌గా తీసుకోవాలని కాగ్‌ను కోరామని ఆమె తెలిపారు.

ఈ సందర్భంగా పలు అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రజలు బహిష్కరించాలని షర్మిల పిలుపునిచ్చారు. మునుగోడు వచ్చిన ఎలక్షన్ కాదు, తెచ్చుకున్న ఎలక్షన్ అని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడమేనని విమర్శించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు మరో రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదని ఆమె అభిప్రాయపడ్డారు. సునీత రెడ్డికి న్యాయం జరగాలని షర్మిల ఆకాంక్షించారు. వివేకానంద రెడ్డిని హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. షర్మిల ఢిల్లీ పర్యటనలో వైఎస్సార్టీపీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు, పార్టీ మహిళాధ్యక్షురాలు జి.కవిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement