Friday, May 3, 2024

BRS Party Election Campaign – ఒక్కసారి ఆలోచించండి.. ఎవరిది జన హితం.. ఎవరిదీ సొంత లాభం – ఓటర్లతో కెసిఆర్

కలిసి కష్టాలు తట్టుకున్నాం, సంపద పెంచాం, ధనిక రాష్ట్రంగా తెలగాణాను మార్చుకున్నాం, ఆర్ధిక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నాం. ఎన్నికలు వచ్చాయి. ఎవరో వస్తున్నారు, ఏదో చెప్తారు, రకరకాలు మాటలు చెప్తాడు, అలిమికానీ హామీలు ఇస్తాడు, బట్ట కాల్చి మీద వేస్తాడు. సాయి సంసారి , లచ్చి దొంగంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఎవరు అభివృద్ధి చేశారు? ఎవరు ప్రజల కోసం పని చేస్తున్నారు? గమనించి మీ ఓటు వజ్రాయుధంగా వినియోగించండి, అని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు కోరారు.

మహేశ్వరంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలోని ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. గురువారం ఉదయం జోరున వర్షం కురిసినా.. సభా సమయంలో వాన జల్లులు కురుస్తున్నా.. జనం ఎక్కడా ఆగలేదు. ప్రజా ఆశీర్వాద సభకు తండోప తండాలుగా తరలివచ్చారు. మహేశ్వరం గులాబీ జెండాలతో రెపరెపలాడింది. జనం పోటెత్తారు. ఈ జనం వెల్లువను గుర్తించిన కేసీఆర్ మాట్లాడుతూ, ఇంత వర్షంలోనూ ఇంత మంది వచ్చారంటే సబితా ఇంద్రారెడ్డి విజయం ఖాయమన్నారు.

ఈ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, జనం మనిషిగా సబితా ఇంద్రారెడ్డి ఎన్నో కీలక సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, గ్రామీణ, పట్టణ వాతావరణంలో మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధికి రూ.3000 కోట్లు నిధులు సాధించారని సీఎం కేసీఆర్ వివరించారు. తాగునీరు, ముంపు సమస్యతో తల్లడిల్లే బడంపేట, జల్లపల్లి. తుక్కుకూడ, మీర్ పేటల్లో నల్లాల సమస్యల పరిష్కరించటంతోనే ఆయా చెరువుల్లో నీళ్లు వదిలితే కిందకు పోవటం, వదలక పోతే కాలనీలు మునిగిపోయే పరిస్థితి తప్పిందన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాలన్నీ ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి అనే చందంగా ఉండేవని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఈ ప్రాంతాల్లో తాగు నీటి సమస్య తీవ్ర జటిలమని, కానీ పైప్లైన్లు వేయటానికి జలమండలి వేలకోట్ల నిధులు అడిగేదని, సబితా ఇంద్రారెడ్డి పట్టుదలతో రూ.670 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గంలోని కుత్పల్లాపూర్, రాజేంద్రనగర్ సహా అనేక శివారు పట్టణాల్లో తాగునీటి సమస్య తీర్చామన్నారు.

అనేక జూనియర్ కాలేజీలు, డిగ్రీకాలేజీల ఏర్పాటుకు కృషి చేసిన సబితాఇంద్రా రెడ్డి కందుకూరులో మెడికల్ కాలేజీ కావాలని కోరారని, అందుకు మంచి మెడికల్ కాలేజీని మంజూరు చేశామని, దీంతో 500 పడకల ఆసుపత్రి వస్తోందని, పారా మెడికల్ కోర్సులు, నర్సింగ్ కోర్సులు వస్తున్నాయని, దీంతో కందుకూరు ఒక హబ్గా మారుతుందని సీఎం కేసీఆర్ వివరించారు. తుక్కుగూడెంలో కొత్తగా 52 పరిశ్రమలు రాబోతున్నాయి, లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి, చైనా కంపెనీ కూడా వస్తోంది, 2 లక్షల ఉద్యోగాలు లభిస్తాయి, అంటే మహేశ్వరం నియోజక వర్గంలో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కావటమే కాదు, విద్యా, ఉపాధి అవకాశాలూ పెరిగాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇక అభివృద్ధి, సంక్షేమంలో బీఆర్ఎస్ ఎక్కడా తగ్గటం లేదని, వృద్ధులు, వితంతువు, ఒంటరి మహిళలు, వికలాంగులకు నెలకు రూ.2000లు పెన్షన్ ఇస్తున్నామని, రాబోయే ఐదేళ్లల్లో క్రమంగా ఈ పెన్షన్ను రూ.5000లకు పెంచుతామని , రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, ధరణి పథకాలను అమలు చేస్తుంటే.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు దుబారా అంటున్నారని, ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంటును ఉచితంగా ఇస్తుంటే కరెంటును వృథా చేస్తున్నామని ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారని, రైతు బంధు పథకానికి కీలకమైన ధరణీని బంగాళాఖాతంలో వేస్తామని భట్టి విక్రమార్క అంటున్నారని, అంటే కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ప్రజాహితం కాదని, పైరవీల రాజ్యం, కబ్జాల రాజ్యం కోరుకుంటున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement