Saturday, May 18, 2024

Jumping – కాంగ్రెస్ గూటికి రేవూరి ప్రకాష్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, ఏనుగు రవీందర్ రెడ్డి..

హైదరాబాద్ – ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ లో చేరిక‌లు జోరందుకున్నాయి.. బిఆర్ఎస్ లో సీటు ఆశించి భంగ‌ప‌డ్డ నేత‌లు..బిజెపిలో అసంతృప్తితో ఉన్న నాయ‌కులు.., గ‌త కొంత కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న‌లీడ‌ర్స్ ఇప్పుడ వ‌ర‌స క‌ట్టి క్యూక‌డుతున్నారు.. తాజాగా ఇద్ద‌రు సీనియ‌ర్ నేత‌లు హ‌స్తం లోకి వ‌చ్చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన రేవూరి ప్రకాశ్ రెడ్డి కాగా.. మరొకరు మండవ వెంటేశ్వరరావు. ఈ ఇద్దరూ టీడీపీ హయాంలో చక్రం తిప్పిన నేతలే. ప్రత్యేక రాష్ట్రం రావడం, ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ బలగం తగ్గడంతో రేవూరి.. బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. మండవకు ఇంటికెళ్లి మరీ కేసీఆర్ గులాబీ కండువా కప్పారు. పార్టీలు అయితే మారారు కానీ.. ఏళ్లు గడుస్తున్నా ఈ ఇద్దరికీ ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. 2023 ఎన్నికల్లో అయినా తమను గుర్తించి టికెట్లు ఇవ్వడం లేకుంటే కనీస ప్రాధాన్యత అయినా పార్టీ పెద్దలు ఇస్తారని భావించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఇక కాషాయ కండువా తీసేయాలని రేవూరి కారు దిగేయాలని మండవ భావించారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ఒకప్పుడు కలిసి పనిచేసిన తన మిత్రులతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టచ్‌లోకి వెళ్లారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కండువా కప్పుకోక మునుపే రేవూరి ప్రకాశ్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా హైకమాండ్ ఖరారు చేసిందని తెలుస్తోంది. ప‌ర‌కాల నుంచి ఆయ‌న బ‌రిలోకి దిగ‌నున్నారు.. ఈ నెల 18న ములుగులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభావేదికగా రేవూరి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు.

ఇక మండవ వెంకటేశ్వరరావు విషయానికొస్తే ఆయన అసంతృప్తిగా ఉన్నారని తెలుసుకున్న రేవంత్ స్వయంగా ఇంటికెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మండవ కూడా ములుగు సభలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. మండవ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఇరవై ఏండ్లకు పైగా నిజామాబాద్ టీడీపీ జిల్లా పాలిటిక్స్‌ను శాసించిన నేత. టీడీపీ బీఆర్ఎస్‌లో గుర్తింపులేక నాలుగున్నరేండ్ల నుంచి సైలెంట్‌గా ఉండిపోయారు. ఈయన ఖమ్మం జిల్లా కీలకనేత తుమ్మల నాగేశ్వరరావుకు దగ్గరి బంధువు. బీఆర్ఎస్‌లో పరిస్థితులు సర్లేకపోవడంతో తుమ్మల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అందుకే మండవను కూడా తుమ్మల కాంగ్రెస్‌లో చేరమని మంతనాలు జరిపారట. అందుకే రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. కాగా.. మండవ వస్తే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్​మరింత బలపడుతోందని, ఎన్నికల నేపథ్యంలో మరింత కలిసొస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అలాగే మండ‌వ‌ను ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో ఎదో ఒక స్థానం నుంచి బ‌రిలోకి దింపాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం..

చివరగా ఏనుగుల రవీంద్రరెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.. వీరంతా రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరనున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement