Saturday, April 27, 2024

Weather Alert: రెండు రోజులపాటు అతి భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణశాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతోపాటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణశాఖ పేర్కొంది. రెండు రోజులపాటు రాష్ట్రంలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆతర్వాతి రెండు రోజులపాటు ఆరెంజ్‌ హెచ్చరికలను జ ఆరీ చేసింది. ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదవుతోంది. హైదరాబాద్‌ నగరానికి వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ ను జారీ చేసింది.

దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకుని వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 7.6కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ నైరుతి వైపునకు వంగి ఉంది. మహారాష్ట్ర నుంచి కేరళ వరకు తీర ద్రోణి… వీటన్నింటి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతుండడంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. యాదాద్రి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్‌, సూర్యాపేట, జనగామ, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

దంచికొడుతున్న వానలు

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. దీంతో అక్కడక్కడా వరద పోటెత్తాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, మహమూబ్‌నగర్‌ జిల్లాల్లో వాన దంచి కొట్టింది.

నల్గొండలో తల్లీ కూతుళ్ల మృతి..

- Advertisement -

వర్షాలకు నల్గొండలో ఓ ఇల్లు కూలిపోవడంతో తల్లికూతుళ్లు మృతిచెందారు. పట్టణంలోని పద్మానగర్‌లో ఓ ఇంటి గోడ కూలింది. ఆసమయంలో ఇంట్లో నిద్రిస్తున్న నడికుడి లక్ష్మి, ఆమె కూతురు కళ్యాణి మృతిచెందారు. ములుగు జిల్లాలో వర్షం ధాటికి ఇల్లు కూలడంతో లక్ష్మీ అనే మహిళ తీవ్రంగా గాయపడింది.

హైదరాబాద్‌ లో ఎడతెరిపి లేని వాన‌..

హైదరాబాద్‌లో శుక్రవారం తెల్లవారు జామునుంచే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లే సమయం కావడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిపివేత…

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మణుగూరులోని సింగరేణి బొగ్గుగనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లోకి నీరు చేరడంతో అధికారులు బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో కురిసిన వర్షానికి కాకతీయ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సూర్యపేట జిల్లా ౌవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో సంగం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కోడూరు-సూర్యాపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

మహబూబ్‌నగర్‌లో తప్పిన పెను ప్రమాదం..

మహబూబ్‌నగర్‌లో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని కోడూరు వద్ద వరదలో ఓ ప్రయివేటు పాఠశాల బస్సు చిక్కుకుంది. స్థానికుల సహాయంతో డ్రైవర్‌ విద్యార్థులను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి కోడూరు-మాచన్‌పల్లి మధ్య ఉన్న రైల్వే అండర్‌ బ్రిడ్జిలోకి వరద నీరు భారీగా చేరింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ట్రాక్టర్‌ సాయంతో స్కూలు బస్సును బయటకు తీశారు. చిన్నారులంతా క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement