Monday, April 29, 2024

HYD: దేశం గర్వించదగ్గ గొప్ప నాయకులు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు… తలసాని

హైదరాబాద్ : దేశం గర్వించదగ్గ గొప్ప నాయకులు, మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల పీవీ నర్సింహా రావుకు భారతరత్న ప్రకటించిన సందర్బంగా శనివారం బేగంపేటలోని పీవీ నర్సింహారావు భవన్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా పీవీ నర్సింహా రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పీవీ నర్సింహా రావు ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్బంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… పీవీ నర్సింహారావుకు భారతరత్న ప్రకటించడం దేశానికే గర్వకారణమన్నారు. పీవీ నర్సింహా రావుకు భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా లభించిన గౌరవం భారతరత్న అని పేర్కొన్నారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఎంతో విశేషమైన సేవలు అందించారని గుర్తుచేశారు.

ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన ఘనత కూడా పీవీ నర్సింహారావుకే దక్కుతుందన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక తెలుగు వ్యక్తి కూడా పీవీ నర్సింహా రావు అన్నారు. దేశంలో 17భాషలు మాట్లాడగలిగే ఒకే ఒక్కరు పీవీ నర్సింహా రావు అన్నారు. విద్య, ఉద్యోగ, వైద్య రంగాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. తన పరిపాలన దక్షతతో ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతిని చాటి చెప్పారని, అలాంటి మహనీయుడికి భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము అనేక సార్లు డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం కూడా పీవీ నర్సింహా రావు శతజయంతిని సంవత్సరం పాటు ఎంతో గొప్పగా నిర్వహించి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్బంగా తెలిపారు.

మరణించిన తర్వాత కూడా ప్రజల మనస్సుల్లో కొందరు మాత్రమే నిలిచిపోతారని, అందులో పీవీ నర్సింహారావు ముందు వరుసలో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వానిదేవి, పీవీ కుమారుడు ప్రభాకర్ రావు, కార్పొరేటర్ టి.మహేశ్వరి, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, శేఖర్, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీహరి, శేఖర్, ఆరీఫ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement