Friday, May 3, 2024

నిజాంపేట్ నగర పాలక సంస్థ ఉద్యోగుల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

కుత్బుల్లాపూర్ : నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ నగర పాలక సంస్థ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యలని పరిష్కరించేందుకు ఈరోజు ఎమ్మెల్యే కె పి వివేకానందని కొంపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ వినతి పత్రంలో నగర పాలక సంస్థ కార్యాలయంలో వివిధ విభాగాల్లో స్వీపర్లు, కమటిలు, ఎలక్ట్రీషియన్లు, పంప్ ఆపరేటర్లు, సూపర్ వైజర్లు, బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, ఇతర సిబ్బంది మొత్తం 464 సిబ్బంది పనిచేస్తున్నామని, ఈ సిబ్బంది అందరికీ వేతనాలు పెంచాలని, రెగ్యులర్ చేయాలని కోరారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర సాధనలో ప్రభుత్వ ఉద్యోగుల కృషిని గుర్తించి రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని శాఖల ఉద్యోగుల వేతనాలను పెంచి వారి గౌరవానికి తగిన గుర్తింపునిచ్చారని అన్నారు. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మునిసిపల్ ఉద్యోగుల సేవలు మరువలేనివని ఈ సందర్బంగా ఎమ్మెల్యే గుర్తుచేశారు. కేసీఅర్ కూడా ప్రజల కష్ట సుఖాలు తెలిసిన ముఖ్యమంత్రి అని, మీ సమస్యను త్వరలోనే సంబంధిత పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సాయి, సంతోష్, దుర్గేశ్, లక్ష్మన్, విజయ్, ఇతర సిబ్బంది, నగర పాలక సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement