Friday, May 3, 2024

18 ఆసుపత్రుల్లో రోజూ 20 వేల మందికి భోజ‌నాలు : హ‌రీశ్ రావు

18 ఆసుపత్రుల్లో రోజూ సుమారు 20 వేల మందికి భోజ‌నాలు అందిస్తున్నామ‌ని, ఒక్కో ప్లేట్ భోజనానికి ప్రభుత్వం 21 రూపాయలు సబ్సిడీ ఇస్తోందని రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. హ‌రే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ట్రస్ట్ నార్సింగిలో ఏర్పాటు చేసిన సెంట్రలైజెడ్ కిచెన్ ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ….. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు రూ.5 కే భోజనం అందించే కార్యక్రమాన్ని చారిత్రక ఉస్మానియా ఆసుపత్రి వేదికగా గత నెలలో ప్రారంభించుకున్నామ‌న్నారు. ఈ ఆసుపత్రుల్లో భోజనం అందించేందుకు హరే కృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ట్రస్ట్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంట్రలైజెడ్ కిచెన్ ను ఇక్కడ ప్రారంభించిన‌ట్లు తెలిపారు. భోజనామృతం, అన్నపూర్ణ, సద్దిమూట… ఇలా పేరు ఏదైనా, హరే రామతో కలిసి ప్రభుత్వం లక్షల మంది ఆకలి తీర్చడం జరుగుతుంద‌న్నారు. 18 దవాఖానలకు అన్ని జిల్లాల నుంచి చికిత్స కోసం పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారన్నారు. ఒక రోగి వెంట ఒకరో ఇద్దరో సహాయకులు కూడా వస్తారన్నారు. సర్జరీలు జరిగినప్పుడు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు చికిత్స కోసం రోగులు, వారి అటెండెంట్స్ రోజుల తరబడి ఉండాల్సిన పరిస్థితి ఉంద‌న్నారు.

రోగులకు ప్రభత్వమే ఉచితంగా పోషకాహారం అందిస్తోంది.. కానీ వారికి తోడుగా వచ్చేవారు మాత్రం ఆకలికి అలమటిస్తున్నారన్నారు. కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరడమే ఒక నరకమంటే.. ఆకలితో పడుకోవడం ఇంకో నరకమ‌న్నారు. ఇలా రోగుల సహాయకులు మానసికంగా, శారీరకంగా అవస్థలు పడడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారన్నారు. రోగుల సహాయకుల కోసం ఇప్పటికే నైట్ షెల్టర్లు నిర్మించారన్నారు. తాగునీటి వసతి కల్పించారన్నారు. అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఒక పూట ఆకలిని తీరుస్తున్నాయని, అయినా వారు అర్ధాకలితో ఉంటున్నారని సీఎం కేసీఆర్ గ్రహించారన్నారు. మానవత్వంతో ఆలోచించి రోగుల సహాయకులకు రూ.5 లకే మూడు పూటలా కడుపు నిండా భోజనం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి… బడ్జెట్ లో చెప్పినట్లు అమలు చేశారన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 దవాఖానల్లో భోజనం కోసం ప్రభుత్వం ఏటా రూ.38.66 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.

పారిశుధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ మేరకు బడ్జెట్ లో ప్రభుత్వం బెడ్ ఒక్కంటికి చేసే పారిశుద్ద్య ఖర్చును రూ.5000 నుంచి రూ.7500 లకు పెంచిందన్నారు. ఇందు కోసం ప్రభుత్వం రూ.338 కోట్లను ప్రతి సంవత్సరం వెచ్చించనుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉత్తమ వైద్య చికిత్స అందించేందుకు పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేస్తూ అత్యాధునిక వైద్య పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ వైద్య ప‌రిక‌రాల నిర్వ‌హ‌ణ‌ కోసం దేశంలోనే తొలిసారిగా బ‌యో మెడిక‌ల్ ఎక్విప్‌మెంట్ మెయింట‌నెన్స్ పేరుతో పాల‌సీ అమలు చేస్తున్నామ‌న్నారు. హైద‌రాబాద్ జ‌నాభా, రాష్ట్ర జ‌నాభా ఏటా పెరుగుతూ వ‌స్తున్నా, అందుకు త‌గిన‌ట్లుగా వైద్య స‌దుపాయాల క‌ల్ప‌న‌పై ఏనాడు నాటి ప్ర‌భుత్వాలు దృష్టి సారించ‌లేదన్నారు. దీంతో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుప‌త్రుల‌పై తీవ్ర‌ ఒత్తిడి పెరిగిందన్నారు.

- Advertisement -

ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ న‌గ‌రం న‌లువైపులా నాలుగు టిమ్స్ ఆసుప‌త్రులు ఏర్పాటు చేయాల‌నే చారిత్ర‌క నిర్ణ‌యం తీసుకున్నారన్నారు. దీంతో ఇక్క‌డి ఆసుప‌త్రుల‌పై ఒత్తిడి త‌గ్గించ‌డంతో పాటు, రోగుల‌కు ఎక్క‌డిక్క‌డ సూప‌ర్ స్పెషాలిటీ సేవ‌లు అంద‌నున్నాయన్నారు. రూ. 2,679 కోట్ల‌తో నిర్మించ‌నున్న 3 సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రులకు ముఖ్యమంత్రి శంకుస్థాప‌న చేశారన్నారు. ఒకవైపు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులను బలోపేతం చేస్తూనే.. మరో వైపు కొత్త ఆసుపత్రుల నిర్మాణం ప్రభుత్వం చేస్తుంద‌న్నారు. పేదలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారని, ఇవి విజయవంతం కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు అవార్డులు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మహేష్ రెడ్డి, జడ్పీ చైర్మన్ అనిత రెడ్డి, నార్సింగి మున్సిపల్ ఛైర్మెన్ రేఖ యాదరిగిరి, వైస్ చైర్మన్ జి.వెంకటేష్ యాదవ్, నార్సింగి మున్సిపల్ కమీషనర్ సత్యబాబు, కౌన్సిలర్ శ్రీకాంత్ రావు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement