Saturday, May 11, 2024

దివంగ‌త ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు తెలంగాణ అసెంబ్లీ ఘ‌న నివాళి..

హైద‌రాబాద్ : తెలంగాణలో ఇటీవ‌లి కాలంలో మ‌ర‌ణించిన ఎమ్మెల్యేల‌కు శాస‌న‌స‌భ నివాళుల‌ర్పించింది. నాగార్జున సాగ‌ర్ దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య‌, బెల్లంప‌ల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మ‌ల్లేష్, ముషీరాబాద్‌ మాజీ ఎమ్మెల్యే నాయిని న‌ర్సింహారెడ్డి, ప‌రిగి మాజీ ఎమ్మెల్యే క‌మ‌తం రాంరెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే క‌టిక‌నేని మ‌ధుసూద‌న్ రావు, మ‌ధిర మాజీ ఎమ్మెల్యే క‌ట్టా వెంక‌ట న‌ర్స‌య్య, చెన్నూరు మాజీ స‌భ్యులు దుగ్యాల శ్రీనివాస్ రావు, జ‌హీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగ‌ల్ బాగ‌న్న, అమ‌ర‌చింత మాజీ ఎమ్మెల్యే కే వీరారెడ్డికి స‌భ నివాళుల‌ర్పించింది. వీరంద‌రి ఆత్మ‌ల‌కు శాంతి చేకూరాల‌ని స‌భ్యులంద‌రూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
శాస‌న‌స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే నాగార్జున సాగ‌ర్ దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య మృతి ప‌ట్ల స‌భ‌లో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంతాప తీర్మానాన్ని మంత్రులు జ‌గ‌దీష్ రెడ్డి, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, కేటీఆర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సండ్ర వెంక‌ట వీర‌య్య‌, చిరుమర్తి లింగ‌య్య‌, బొల్లం మ‌ల్ల‌య్య యాద‌వ్‌, ర‌వీంద్ర నాయ‌క్‌, జైపాల్ యాద‌వ్‌, కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీర‌య్య‌, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంఐఎం ఎమ్మెల్యే జాఫ‌ర్ హుస్సేన్ బ‌ల‌ప‌రిచారు. సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని స‌భ్యులంద‌రూ బ‌ల‌ప‌రిచి నోముల న‌ర్సింహ‌య్య మృతికి సంతాపం తెలిపారు.
ఈ సంద‌ర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, నాగార్జున సాగ‌ర్ దివంగ‌త ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య ఆత్మీయ‌త‌ను ఎప్ప‌టికీ మ‌రువ‌లేన‌ని.. ఆయ‌న ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతార‌ని అన్నారు. ఇలాంటి బాధాక‌ర‌మైన తీర్మానం ప్ర‌వేశ‌పెడుతాన‌ని అనుకోలేద‌ని, నోముల న‌ర్సింహ‌య్య వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు ద‌గ్గ‌రి మిత్రుడ‌ని అన్నారు.. ‘విద్యార్థి ద‌శ నుంచే ఉద్య‌మాల‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. పేద ప్ర‌జ‌ల ప‌క్షం వ‌హించి ప్ర‌జా న్యాయ‌వాదిగా పేరు తెచ్చుకున్నారు. త‌న ఆశ‌యాల‌కు అనుగుణంగా సీపీఎం పార్టీలో చేరారు. మండ‌ల ప‌రిష‌త్ అధ్య‌క్షునిగా ప్రారంభ‌మైన నోముల ప్ర‌స్థానం ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. ఆయ‌న ప్ర‌సంగాలు ఎంద‌రినో ఆక‌ర్షించేవి. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించడంలో ఆయ‌న దిట్ట‌. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా రైతుల హ‌క్కుల కోసం న‌ర్సింహ‌య్య నిరంత‌రం పోరాడారు. న‌కిరేక‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు గెలుపొందారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ప‌ట్ల సీపీఎం పార్టీ వైఖ‌రికి నిర‌స‌న‌గా ఆ పార్టీని వ‌దిలి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో నాగార్జున సాగ‌ర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 64 ఏండ్ల వ‌య‌సులో గ‌త డిసెంబ‌ర్‌లో గుండెపోటుతో మ‌ర‌ణించ‌డం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తీర‌ని దుఃఖాన్ని మిగిల్చింది. ఆయ‌న ఆత్మీయ‌త‌ను ఎప్ప‌టికీ మ‌రువ‌లేను. న‌ర్సింహ‌య్య ప్ర‌జ‌ల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతారు’ అని సీఎం అన్నారు.
ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు మాట్లాడుతూ.. ‘నోముల మ‌ర‌ణం చాలా బాధాక‌రం. వారికి త‌న‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. నోముల వ‌రంగ‌ల్ బిడ్డ‌ను పెళ్లి చేసుకున్నారు. అలా ఆయ‌న త‌న‌ను మామ అని పిలిచేవారు. తాను కూడా నోముల‌ను అల్లుడి అని ఆప్యాయంగా ప‌లుక‌రించేవాన్ని అని ఎర్ర‌బెల్లి తెలిపారు. రైతుల‌కు మ‌ద్ద‌తుగా నిరంత‌రం కృషి చేసేవారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో గ్రామాలు బాగుపడుతున్నాయ‌ని ఎన్నోసార్లు నోముల గుర్తు చేసేవారు. విమ‌ర్శ కూడా ఒక ప‌ద్ధ‌తిగా ఉండేది. నోముల ప్ర‌సంగాల ద్వారా ఎన్నో విష‌యాలు నేర్చుకున్నాను. ప్ర‌జ‌ల కోసం పోరాటం చేసిన నాయ‌కుడు మ‌న మ‌ధ్య‌లో లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం’ అని అన్నారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఎనిమిది సంవ‌త్స‌రాలుగా నోముల‌తో అనుబంధం ఉంది. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో మున్సిపాలిటీలు లేవు. 15 వేల పైచిలుకు జ‌నాభా ఉండే మేజ‌ర్ గ్రామ‌పంచాయ‌తీల‌ను మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేప‌థ్యంలో సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని నందికొండ‌, హాలియాను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశాం. ఈ మున్సిపాలిటీల్లో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి.. ప‌రిష్క‌రించాలి అని నోముల త‌న‌ను ప‌దేప‌దే కోరేవారు. అణ‌గారిన వ‌ర్గాల కోసం గొంతు విప్పిన నాయ‌కుడిగా నోముల‌కు పేరుంది. ఎన్నో సంద‌ర్భాల్లో ఆయ‌న తెలంగాణ గురించి మాట్లాడేవారు. నోముల మ‌ర‌ణం సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికే కాకుండా, ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు తీర‌ని లోటు’ అని పేర్కొన్నారు. నోముల మ‌ర‌ణం ప‌ట్ల తీవ్ర‌మైన సంతాపం తెలుపుతున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement