Saturday, July 27, 2024

TS | ప్రాణహిత పునర్మిణానికి పచ్చజెండా..

కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదిపై నిర్మించతలపెట్టిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సుజల స్రవంతి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పునర్మిణానికి మోక్షం లభించనుంది. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ.28,024 కోట్లు కేటాయించగా ఈ నిధులతో ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించింది. దీంతో మళ్లీ ఈ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాజెక్టు నిర్మణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించ డంతో ఈ ప్రాంత రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఈ ప్రాంత రైతాంగంలో ఆశలు మరోసారి చిగురిస్తున్నాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఒంటెత్తు పోకడలతో ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి నోచుకోలేదు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రాజెక్టు వద్ద ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదు. దీంతో ఈ ప్రాంత రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణపనులను పున: ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకోవడం అందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కుమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలోని లక్షల ఎకరాలలో సాగునీరు అంద నుంది. దీంతో ఈ ప్రాంతం పచ్చని పొలాలతో కళకళలాడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement