Wednesday, May 1, 2024

TS | తెలంగాణ‌ అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. పండుగ లెక్క జ‌ర‌పాలే: సీఎం కేసీఆర్‌

రాష్ట్ర ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జ‌ర‌పాల‌ని.. వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమం సహా ప్రతి రంగంలో సాధించిన అద్భుత విజయాలను పల్లె పల్లెన ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. 21 రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవాల ప్రారంభ వేడుకలను జూన్ 2వ తేదీన‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాల నిర్వహణ, కార్యాచరణ సంబంధిత అంశాలపై సీఎం అధ్యక్షతన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.

అవతరణ దినోత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమాలను ఎలా నిర్వహించాలో ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ‘దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో గొప్ప సందర్భం. ఒకనాడు అనేక అవమానాలకు, అపోహలకు గురైన తెలంగాణ నేడు అత్యద్భుతంగా వెలుగొందుతున్నది. విద్యుత్తు, వ్యవసాయంతోపాటు సాగు నీరు సహా ప్రతి రంగంలో దేశానికే ఆదర్శంగా ప్రగతిని నమోదు చేసుకుంటూ పోతున్నది. నేడు స్వయంపాలన ఫలాలు ప్రజలకు అందుతున్నవి. పదేండ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని పల్లె పల్లెనా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకోవాలి’ అన్నారు.

ఆటపాటలతో ఘనంగా జరుపుకోవాలి
‘విద్యుత్ రంగం తరహాలో తెలంగాణ ప్రభుత్వం పటిష్టపరిచిన వ్యవసాయం, సంక్షేమం, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, ప్రతి రంగంలో సాధించిన అభివృద్ధిని పేరు పేరునా ప్రజలకు పలు ప్రసార మాధ్యమాలు, మార్గాల ద్వారా చేరవేయాలి. స్వరాష్ట్ర సాధన ఫలాలను అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలతో ఈ మూడు వారాల పాటు మమేకం కావాలి. వారి భాగస్వామ్యంతో పల్లె నుంచి పట్నం దాకా దశాబ్ది ఉత్సవాలను ఆటాపాటలతో పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలి’ అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement