Wednesday, May 1, 2024

కొత్తగా మరో పథకానికి శ్రీకారం చుట్టనున్న సీఎం కేసీఆర్‌.. నిరుద్యోగ యువత కోసం ఉపాదిబంధు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టాలని ప్రతిపాదించింది. డిగ్రీ ఆపై చదువులు పూర్తిచేసిన నిరుద్యోగులు తమ కాళ్లమీద తాము నిలబడేలా ఎటువంటి ఆంక్షలు లేకుండా రుణాన్ని ఇవ్వాలన్న ప్రతిపాదనపై పరిశ్రమలు, ఉపాధి కల్పనాశాఖలు చర్చోపచర్చలు జరుపుతోంది. దళిత, గిరిజన బంధు తరహాలోనే యువత వ్యాపార సంస్థలు, చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఒక్కొక్కరికి రూ.3లక్షల నుంచి రూ.5లక్షల రూపాయలను ఇవ్వాలని, బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా సంబంధిత జిల్లా కలెక్టర్ల ద్వారా ఈ నిధులను సమకూర్చేందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త పథ కానికి ఉపాధి బంధుగా నామకరణం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లి ఎన్నికలకు ముందు యువతకు ప్రతి నెలా రూ.3016ల భృతిని కల్పిస్తామని ప్రచార సభల్లో హామీ ఇవ్వడంతోపాటు ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన సంగతి తెలిసిందే.

అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వడం లేదన్న విపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టేవిధంగా ఉపాధిబంధు పథకాన్ని ప్రవేశపెట్టాలన్న నిర్ణయానికి సీఎం కేసీఆర్‌ వచ్చినట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఆయా జిల్లాల ఉపాధికల్పనా కార్యాలయాల ద్వారా ఆయా జిల్లాల్లో ఉన్న నిరుద్యోగుల వివరాలను సేకరించాలని నిర్ణయించింది. ప్రభుత్వం గతంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ద్వారా వివరాలు ఉన్నప్పటికీ తాజాగా ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితిని తెలుసుకుని ఎంత మంది డిగ్రీ ఆపై చదువులు చదివారు, అందులో ఎంతమందికి ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు వచ్చాయి..?, ఇంకా ఎంతమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, ఇందులో ఇప్పటికే వ్యాపారాల్లో స్థిరపడ్డ వారు ఎంతమంది, వారు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారు, ఆదాయ వివరాలు ఏంటీ..? అనే సమాచారాన్ని సేకరించాలని ముఖ్యమంత్రి కోరినట్లు సమాచారం. జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయాల ద్వారా పూర్తిస్థాయిలో సమాచారం వచ్చాక ఈ కొత్త పథకానికి రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, పోలీసు నియామక మండలి, వైద్య, ఆరోగ్యశాఖ, ఇతర నియామక సంస్థల ద్వారా ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దశల వారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఎంతమంది నిరుద్యోగులుగా ఉంటారో ఆ వివరాలను సేకరించి ఆ తర్వాత ఈ కొత్త పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. నిరుద్యోగ భృతి ద్వారా ప్రతి నెలా రూ.3016లు చెల్లించడం కన్నా స్వయం ఉపాధి పొందేందుకు కొంత మొత్తాన్ని కేటాయిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తంకావడంతో ఈ కొత్త పథకానికి రూపకల్పన చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పథకం అమలుకు మరో ఆరేడు, నెలల సమయం పట్టే అవకాశం ఉందని కూడా ఆవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం…

- Advertisement -

గ్రామీణ ప్రాంతాల్లో నివాసముంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం ద్వారా కుటుంబాన్ని పోషించుకునే అవకాశం ఉంటుందని, అటువంటి వారికి రుణాన్ని మంజూరు చేసి ఆదుకోవాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. విస్త్తరాకులు తయారు చేసే మిషన్‌లను, అగరబత్తులు తయారు చేసే యంత్రాలను, ప్లాస్టిక్‌ టీ కప్పులు, పేపర్‌ ప్లేట్లు ఇలా స్వయం ఉపాధికల్పనకు అవసరమైన యంత్ర సామాగ్రిని సమకూర్చుకునేందుకు వీలుగా నిధులు ఇవ్వాలన్న ప్రతిపాదనపై చర్చిస్తున్నారు. చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా యాజమాన్యం తమ సొంత కాళ్లపై నిలబడడంతోపాటు మరో పది మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి. బాగా చదువుకుని గ్రామీణ ప్రాంతాల్లో స్థిరపడిన మహిళలకు కూడా ఈ పథకం ద్వారా నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బొటిక్‌లను ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఇంటి వద్దే ఉండి చీరలు, టైలరింగ్‌ మెటీరియల్‌ వ్యాపారం చేసుకునేందుకు వీలుగా మహిళలకు నిధులు ఇచ్చే అంశాన్ని ప్రతిపాదించాలని పరిశ్రమల శాఖ భావిస్తోంది. ఈ పథకానికి సంబంధించి ఇటీవలె సంప్రదింపులు మొదలయ్యాయని, అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని ఉపాధికల్పనాశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కొత్తగా ప్రారంభించాలనుకున్న ఈ పథకానికి ప్రతి జిల్లాలో కనీసం అయిదు నుంచి పదివేల మందికి రుణాలు ఇవ్వాలని, దశలవారీగా ఈ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement