Tuesday, September 17, 2024

TS: సర్కార్ బడికి వెళ్లాలంటే సర్కస్ ఫీట్లే!!

విద్యార్థులు విద్యకు దూరంగా ఉన్న దుస్థితి. నేడు పరిస్థితులు చక్కదిద్దుకోవడంతో విద్యాభ్యాసం కోసంవిద్యార్థులు ఉరుకులు, పరుగులు పెడుతున్న సందర్భంసృష్టిలో ప్రకృతి మానవ మనుగడకు ప్రధాన భూమిక పోషిస్తుంది. కానీ అదే ప్రకృతి ఏ రూపంలోనైనా కన్నెర్ర చేసినప్పుడు సమాజం ఒక ప్రాంతంలో ఒక విధంగా విలవిలలాడుతూ అవస్థలు పడతారు. కానీ ఇక్కడ మాత్రం ప్రకృతి విశ్వరూపం చూపుతున్న ప్రతి సందర్భంలో కూడా విద్యార్థులకు విద్య శాపంగా మారుతుందని చెప్పవచ్చు

టేకుమట్ల, ఆగస్టు 19 (ప్రభ న్యూస్): వరద ఉధృతికి టేకుమట్ల రాఘవరెడ్డి చలివాగుపై నదిపై నిర్మించిన వంతెన కురిసిన వర్షానికి కూలిపోయింది. రాఘవ రెడ్డి పేట, కుందనపల్లి, బండ పల్లె, దుబ్యాల, మందారోని పల్లి, ఎంపెడు మధ్య రాకపోకలు ఆగిపోయి ఇరవై రోజులు కావస్తున్నా ప్రత్యామ్నాయం చూపకపోవడంతో జనం ప్రైవేటు వాహనాలు తీసుకొని మొగుళ్ళపల్లి మీదుగా టేకుమట్లకు రావడం జరుగుతుంది. కొంతమంది అంకుశ పురం నుండి వాగు దాటుతూ మండల కేంద్రానికి నడక తప్పడం లేదు. పైగా వాగుల నుండి పొలం గట్ల పైనుండి నడుచుకుంటూ రాఘవరెడ్డి పేట, కుందన పెళ్లి తదితర గ్రామాల విద్యార్థులు, డిగ్రీ, ఇంటర్ చదివే మండల విద్యార్థులు, విధులకు వెళ్లే ఉద్యోగులు, టేకుమట్ల వాగవతలి గ్రామాల్లో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, తదితర శాఖల అధికారులు విధులు నిర్వహించాలంటే వాగు దాటాల్సిందే. ఆస్పత్రులకు వెళ్లే రోగులకు నది దాటాలంటే వంతెన కష్టాలు తప్పడం లేదు. కూలిన బ్రిడ్జి స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నడిచేందుకైనా అవకాశం కల్పించాలని జనం విన్నవిస్తున్నారు.


బడికి వెళ్లాలంటే పొలం గట్లపై సాహసం చేయాల్సిందే…
కూలి పనులకు వెళ్లాలన్నా, విద్యార్థులు చదువుకోవడానికి పాఠశాల, కళాశాలలకు వెళ్లాలన్నాసాహసం చేయాల్సిందే. కొన్నేళ్లుగా కలగా మిగిలిపోయిన గ్రామస్తుల కోరిక ఎట్టకేలకు నెరవేరింది అని అనుకుంటే వరదల ఉధృతితో వంతెన కూలడంతో పాత రోజులే గుర్తుకు వచ్చాయి. వాగవతలి గ్రామాలు మండల కేంద్రానికి రావాలంటే మొగులపల్లి మండలం మీదుగా చిట్యాల మండలం మీదుగా టేకుమట్లకు రావడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని తాత్కాలికంగా ఏదైనా ఏర్పాటు చేయాలని వాగవతలి గ్రామస్తులు కోరుతున్నారు.


అధికారులకు తప్పని అవస్థలు..
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని చలివాగు వంతెనపై నిర్మించిన వంతెన కూలిపోవడంతో మండల కేంద్రానికి, వాగు అవతలి గ్రామాలకు రవాణా స్తంభించడంతో గతంలో రోజులు ముందుకొచ్చాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వాగు అవతలి గ్రామాలైన రాఘవరెడ్డిపేట, కుందనపల్లి, ఎంపేడు గ్రామాలకు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల విషయమై రెవిన్యూ సిబ్బంది తదితర శాఖల అధికారులు చలివాగు నుంచి దాటుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతిరోజూ రాఘవరెడ్డిపేట నుంచి మండల కేంద్రానికి పిల్లలు, వృద్ధులు చలివాగును దాటుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెన కూలి నెలరోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయలేదని అధికారులు నాయకులపై మండిపోతున్నారు.

- Advertisement -


ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం (నితిన్, పదవ తరగతి) ..
మాది రాఘవరెడ్డి పేట. నాపేరు నితిన్. టేకుమట్ల మండలంలోని ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా. ఇటీవల కురిసిన వర్షానికి రాఘవ రెడ్డిపేట టేకుమట్ల మధ్యలో చలివాగుపై నిర్మించిన వంతెన కూలిపోవడం వల్ల రాకపోకలు ఆగిపోయాయి. పాఠశాలకు వెళ్లాలంటే అంకుశపురం వాగు దాటాల్సిందే. రాఘవరెడ్డిపేట నుండి పొలం గట్లపైనుండి దాటి 8 కి.మీలు నడిచి పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం.


ప్రభుత్వం వెంటనే స్పందించాలి (రామకృష్ణ, విద్యార్థి) ..
నా పేరు రామకృష్ణ. నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. ప్రతిరోజు రాఘవరెడ్డి పేట నుండి వెళ్లాలంటే వంతెన కూలడంతో ఇబ్బంది పడుతున్నాము. మా చదువు ఆగమయ్యేట్టుగా ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి నూతన వంతెన ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. వంతెన కూలడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగు దాటుకుంటూ బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సివస్తుందని, వీలైనంత త్వరగా నూతన వంతెనను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

Advertisement

తాజా వార్తలు

Advertisement