Tuesday, October 8, 2024

TS : మణికొండ జల మండలిలో కుర్చీలాట… వేసవి ముంగిట బదిలీల ప్రహసనం…

మణికొండ, మార్చి 3(ప్రభ న్యూస్): మహా నగరంగా మారిన హైదరాబాద్ లో ఓవైపు వేగంగా ప్రగతి సాధిస్తున్నా.. అంతే స్థాయిలో తాగు నీటి సమస్య నెలకొన్న ప్రాంతం మణికొండ. వేసవి కాలం వచ్చిందంటే బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీలు అనే తేడా లేకుండా మణికొండలో నీటి ఎద్దడి తలెత్తుతోంది.

- Advertisement -

అయితే, జల మండలి సత్వరం స్పందిస్తుండడంతో సమస్య తీవ్రం కాకుండా ఉంటోంది. అలాంటి జల మండలిలో.. సరిగ్గా వేసవి ముంగిట కుర్చీలా నెలకొంది. ఒకే రోజు రెండు రకాల ఉత్తర్వులు జారీ కావడం.. ఇక్కడి నుంచి అధికారి బదిలీ కావడం.. ఆయన స్థానంలో కొత్త అధికారి వచ్చి బాధ్యతలు చేపట్టడం.. ఉత్తర్వులు మార్చి మళ్లీ పాత అధికారినే కొనసాగించడం అంతా ఓ కథలా సాగిపోయింది. ఇదంతా చూస్తుంటే.. మణికొండ జల మండలిలో ఏం జరుగుతోంది? అన్న ప్రశ్న వస్తోంది.

ఇంతకూ జరిగింది ఏమిటి…?
మణికొండ జలమండలి-18 డివిజన్ జనరల్ మేనేజర్ గా రవీందర్ రెడ్డి ఐదేళ్ల సుదీర్ఘ కాలం పనిచేశారు. 2019లో ఇక్కడకు వచ్చిన ఆయనను గత నెల 29న గుడి మల్కాపూర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రవీందర్ రెడ్డి స్థానంలో మహేందర్ నాయక్ ను నియమించారు. ఈయన గుడి మల్కాపూర్ డివిజన్ 3 నుంచి వచ్చారు. గతంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా మణికొండలోనే పనిచేసిన మహేందర్ నాయక్​ నివారం బాధ్యతలు కూడా చేపట్టారు. ఆయనను ఓ కాలనీ సంక్షేమ సంఘం వారు కలిసి సమస్యలను విన్నవించడం గమనార్హం. కానీ, ఆ తర్వాతనే కొత్త ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటిపైన కూడా గత 29వ తేదీనే ఉండడం పరిశీలించదగిన అంశం.

ఉత్తర్వుల్లో గందరగోళం..
ఒకే రోజు (ఫిబ్రవరి 29) వెలువడిన రెండు ఉత్తర్వుల ప్రకారం.. తొలుత రవీందర్ రెడ్డిని బదిలీ చేయగా, అనంతరం ఇటీవలి బదిలీలను వేసవి కాలం ముగిసేవరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. జూలై నుంచి బదిలీ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. దీనిప్రకారం రవీందర్ రెడ్డి జూన్ వరకు మణికొండ జీఎంగానే ఉండనున్నట్లు స్పష్టమవుతోంది. ఉన్నతాధికారులకు ఆయన విన్నవించుకోవడంతోనే బదిలీని నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే, తాజా ఆదేశాలు ఏమైనా వస్తే మార్పులు, చేర్పులు ఉంటాయని పేర్కొనడం గమనార్హం. అంటే.. రెండు రకాల ఉత్తర్వులు జారీ చేయడమే కాక, అందులోనూ మార్పులు ఉంటాయని చెబుతున్నట్లు.

మహేందర్ నాయక్ మళ్లీ అక్కడికే?
గుడిమల్కాపూర్ నుంచి రిలీవ్ అయి వచ్చిన మహేందర్ నాయక్ మణికొండలో బాధ్యతలు చేపట్టారు. ఇక సమీక్షలకు దిగి పరిస్థితిని పరిశీలించే ప్రయత్నాలు చేయాలి అనుకుంటుండగా రవీందర్ రెడ్డికి కొనసాగింపు ఆదేశాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మహేందర్ నాయక్ ను మళ్లీ గుడి మల్కాపూర్ కే పంపనున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే మణికొండలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. ఇలాంటి సమయంలో అధికారుల కుర్చీలాట ఏమిటంటూ ప్రజలు జలమండలిని నిలదీస్తున్నారు.

అభ్యర్థనతోనే.. ‘ఆంధ్రప్రభ’కు వెల్లడి
మణికొండ జల మండలి జీఎంగా రవీందర్ రెడ్డి కొనసాగింపు వెనుక కారణం ఏమిటని జల మండలి ఉన్నతాధికారులను ‘ఆంధ్రప్రభ’ ప్రతినిధి సంప్రదించారు. వేసవిలో ఇక్కడ తలెత్తే నీటి ఎద్దడి కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయంటూ పరిస్థితిని వివరించారు. దీంతో ఉన్నతాధికారులు స్పందిస్తూ.. రవీందర్ రెడ్డి కొన్ని నెలలు పొడిగింపు అడిగారని.. దీంతోనే అనుమతించామని చెప్పుకొచ్చారు. కాగా, అధికారుల బదిలీలు ఎలా ఉన్నా.. ఎండా కాలంలో మాత్రం తమకు నీటి ఎద్దడి రానీయొద్దని మణికొండ ప్రజలు వేడుకుంటున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా, ఫోన్ ద్వారా ‘ఆంధ్రప్రభ’ ప్రతినిధికి విన్నవిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement