Monday, February 26, 2024

TS | 20 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

వేముల‌వాడ (ప్ర‌భ న్యూస్​): జన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలకు చిక్కిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అదిలాబాద్ ఏసీబీ డిఎస్పి, కరీంనగర్ ఇన్చార్జి డిఎస్పి రమణ మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. బండారి ఏవోలు అనే వ్యక్తి గత ఫిబ్రవరి నెలలో సుద్దాల గ్రామంలో ఇంటి నిర్మాణ అనుమతుల నిమిత్తం దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తుకు సంబంధించిన ప్లాను, నాలా కన్వర్షన్, ఇతర దస్తావేజులు గ్రామపంచాయతీలో సమర్పించాడు. దస్తావేజులు సక్రమంగా లేవని పంచాయతీ సెక్రటరీ పెందోట జగదీశ్వర్, ఇంటి నిర్మాణ అనుమతులు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తిని ఇబ్బందులకు గురి చేశాడు.

పని పూర్తి కావాలంటే 30 వేల రూపాయలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఈనెల 14న పదివేల రూపాయలను బండారి ఏవోలు ద్వారా సెక్రటరీ పెందోట జగదీశ్వర్ తీసుకున్నాడు. మిగతా 20వెలు గురువారం రోజున సెక్రటరీకి అందజేస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పంచాయతీ కార్యదర్శి జగదీశ్వర్ ను ఏసీబీ అధికారులు సుమారు 6 గంటల పాటు విచారించారు. విచారణలో పంచాయతీ కార్యదర్శి జగదీశ్వర్ లంచం తీసుకున్నట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. దీంతో పంచాయతీ కార్యదర్శి జగదీశ్వర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

అవినీతి, అక్రమాలకు పాల్పడే ఎంతటి వారైనా తమకు సమాచారం అందించాలని ఏసీబీ డీఎస్పీ ప్రజలను కోరారు. వెంటనే చర్యలు తీసుకుంటామని సమాచారం ఇచ్చిన వారి వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. బాధితుడు బండారి ఏవోలు మాట్లాడుతూ తన ఇంటి నిర్మాణం కోసం నానా ఇబ్బందులకు గురి చేశారని వాపోయాడు. పంచాయతీ కార్యదర్శి భాదలు, ఇబ్బందులు తట్టుకోలేక ఏసీబీని ఆశ్రయించానని తెలిపారు.

సుద్దాల గ్రామంలో నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయనీ ,అసైన్డ్ భూముల్లో కొంతమంది యదేచ్చగా గృహ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఉన్నోడికి ఓ న్యాయం.. లేనోడికి ఓ న్యాయం అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని దుయపట్టాడు. ఏసీబీ దాడుల్లో ఏసీబీ సీఐ జాన్ రెడ్డి, ఏఎస్ఐలు రవీందర్, తిరుపతి, రాము, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement