Friday, May 17, 2024

Vote: న‌గ‌ర బాబులూ మీకో దండం.. ఓటేస్తేనే మీకు పుణ్యం..

హైద‌రాబాద్ – దేశంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఓటింగ్‌పై నగర ఓటర్లు ఉదాశీనంగా ఉన్నారు. నగర ఓటర్లు పోలింగుపై నిరాసక్తత కారణంగా ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గుతోంది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతం 40 నుంచి 55 శాతం మధ్య ఉంది. గతంలో నగర ఓటర్లు పోలింగుకు దూరంగా ఉన్న నేపథ్యంలో గురువారం జరగనున్న తెలంగాణ పోలింగులో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఎన్నికల అధికారులు ప్రచారం చేస్తున్నారు.

బుధ, గురువారాల్లో అన్ని విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం గురువారం వేతనంతో కూడిన సెలవు ప్రకటించడంతో శుక్రవారం ఒక్కటే పని దినం కావడంతో వారాంతానికి టూర్లకు వెళ్లేందుకు నగరవాసులు మొగ్గుచూపే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల అధికారులు ఓటింగ్ శాతంపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నగరవాసులు కొందరు ఇప్పటికే లాంగ్ వీకెండ్ కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. హైదరాబాద్ ఓటర్లు నవంబర్ 30వతేదీన పోలింగ్ కేంద్రాలకు వచ్చి పెద్ద సంఖ్యలో ఓట్లు వేయాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ విజ్ఞప్తి చేశారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాలకు ఉచిత రవాణ సౌకర్యాన్ని కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. అవసరం ఉన్న ఓటర్లకు ఉచిత రవాణ సౌకర్యం కల్పిస్తామని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది. ఓటింగ్ రోజున సెలవు ప్రకటించాలని ఇప్పటికే నగరంలోని ఐటీ సంస్థలకు ఈసీ విజ్ఞప్తి చేసింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్లను ఓట్లు వేయమని ప్రోత్సహించేందుకు ఈసీ అధికారులు ప్రచార పోస్టర్లను నగరంలో ప్రదర్శిస్తున్నారు. చాలా ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు హైదరాబాద్‌లోని ఓటర్లను కలిసి ఓటు హక్కును వినియోగించుకోవాలని వీధి కార్నర్ సమావేశాల్లో కోరాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్‌లు, ఓటు హక్కు,దాని ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా పోలింగ్ శాతాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement