Monday, May 6, 2024

Attack – బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్తపై కాంగ్రెస్ శ్రేణుల దాడి

మంచిర్యాల డిసెంబర్ 1 (ప్రభన్యూస్) : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ శ్రీరాముల సుజాత, ఆమె భర్త శ్రీరాముల మల్లేష్ పై శుక్రవారం సాయంత్రం కొంత మంది కాంగ్రెస్ శ్రేణులు ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే శ్రీరాముల మల్లేష్ కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, వాట్సప్ మేసేజ్ లు గొడవకు దారి తీసినట్లు సమాచారం. బాధితులు మాట్లాడుతూ ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు తమకు ఫోన్ చేసి దుర్భాషలాడటమే కాకుండా ఇంటికి వచ్చి దాడికి పాల్పడ్డారని, ఇంట్లో మహిళలపై కూడా దాడి చేశారని తెలిపారు. చంపేస్తామని, ఇంటిని కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. ప్రేమ్ సాగర్ రావు అనుచరులు కొంతం రమేష్, రామగిరి బానేష్, సల్ల మహేష్, పూదరి ప్రభాకర్, తోట తిరుపతి, కిషన్ బాబు, కొంతం రమేష్ కొడుకు, అగ్గు రవి, మోతుకూరి శ్రీనివాస్, సల్ల మహేష్ అనుచరులైన గాంధీనగర్ కు చెందిన యువకులు చంటి, శివ, సుమారు 40 మంది తమపై దాడి చేశారని, ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.

దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుల ధర్నా :

బీఆర్ఎస్ కౌన్సిలర్, కుటుంబసభ్యులపై దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని మంచిర్యాల పట్టణంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం రాత్రి బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రేమ్ సాగర్ రావు అనుచరులు గుండాలుగా ప్రవర్తిస్తున్నారని, ఇంట్లోకి చొరబడి దాడులకు పాల్పడుతున్నారని, మహిళ కౌన్సిలర్ కే రక్షణ లేకుండా పోయిందని ఆరోపిస్తూ పీఎస్ఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దాడికి పాల్పడిన వారందరిని అరెస్ట్ చేసేంతవరకు ధర్నా విరమించబోమని రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న డీసీపీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ధర్నా వద్దకు చేరుకొని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. బీఆర్ఎస్ నాయకుల ధర్నాతో ఇరువైపుల పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement