Sunday, May 5, 2024

Big Story | హైదరాబాద్‌లోనే అభ్యర్థుల ప్రకటన.. లిస్టు రెడీ చేస్తున్న కాంగ్రెస్ హైకమాండ్​!​

హైదరాబాద్‌ ,ఆంధ్రప్రభ బ్యూరో: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దింపనున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను హైదరాబాద్‌ వేదికగానే ప్రకటించే యోచనలో ఆ పార్టీ అధినాయకత్వం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై లోతుగా కసరత్తు చేసిన ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ (పిఈసీ)ఆ తర్వాత టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆ జాబితాను స్క్రీనింగ్‌ కమిటీకి సీల్డ్‌ కవర్‌లో అందజేసిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చిన స్క్రీనింగ్​ కమిటీ బాధ్యుడు మురళీధరన్‌ కమిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక్కో నియోజక వర్గంనుంచి ముగ్గురి పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసి సీల్డ్‌ కవర్‌లో ఢిల్లీ తీసుకెళ్లారు.

అభ్యర్థుల ఎంపికపై మురధీరన్‌ సమగ్ర నివేదికను సిద్ధం చేసి కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి అందించనున్నారు. తన నాలుగు రోజుల తెలంగాణ పర్యటనలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి జరిపిన కసరత్తు ప్రక్రియనంతా నివేదికలో పొందిపరచనున్నట్టు సమాచారం. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం నుంచి కనీసం రెండు అసెంబ్లీ సీట్లను బీసీ సామజిక వర్గాలకు కేటయించాలన్న డిమాండ్‌ను మురళీధరన్‌ పార్టీ పెద్దల ముందుంచనున్నారు. ముస్లి, క్రిస్టియన్‌ వర్గాలకు కూడా అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వాలని ఆయా సామజిక వర్గాలకు చెందిన నేతలు కోరిన విషయాన్నీ కూడా అయన ఎన్నికల కమిటీకి వివరించనున్నట్టు సమాచారం.మహిళలకు కూడా టికెట్ల కేటయింపులో సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని వచ్చిన వినతులను మురళీధరన్‌ తన నివేదికలో పొందుపరచనున్నారు.

ఢిల్లీలో రేపో ఎల్లుండో తొలి ఎన్నికల కమిటీ భేటీ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్‌ కమిటీలు తమ నివేదికలను పార్టీ పెద్దలకు అందజేశాయి. కేంద్ర ఎన్నికల కమిటీ ఒకటి రెండు రోజుల్లో సమావేశమై తమకు వచ్చిన నివేదికలను పరిశీలించనున్నట్టు సమాచారం. ఇలా రెండు మూడు దఫాలు సమావేశమయ్యాక అభ్యర్థుల ఖరారుకు సంబంధించి ప్రాధమిక అంచనాకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చివర్లో అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేసే సమయంలో ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులను, పార్టీ శాసన సభా పక్షం నాయకులు, రాష్ట్రానికి చెందిన కీలక నేతలతో సంప్రదింపులు జాబితాలను సిద్దం చేసి ప్రకటించనున్నట్టు సమాచారం. కాగా కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యూసి) సమావేశాలు ఈ నెల 16,17 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నందున కేంద్రఎన్నికల కమిటీ తుది సమావేశాన్ని కూడా ఇక్కడే జరిపించి అభ్యర్థుల జాబితా సిద్ధం చేసి ప్రకటించాలన్న యోచనలో పార్టీ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ, యువనేత రాహుల్‌ ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

సిడబ్ల్యూసిలో సభ్యులుగా ఉన్న వారిలో ఎక్కువగా కేంద్ర ఎన్నికల కమిటీలోనూ ఉండడం వల్ల అగ్రనేతలు ఈ ప్రతిపాదనకు వచ్చినట్టు సమాచారం. సిడబ్ల్యూసి సమావేశాల ముగింపు సందర్బంగా మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థుల జాబితాను ప్రకటించాలా? లేక అదే రోజు సాయంత్రం నిర్వహించే బహిరంగ సభలో జాబితాలో ఉన్న వారి పేర్లను చదివి వినిపించడంతో పాటు అభ్యర్థులను సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసి ఎన్నికల్లో వారిని ఆశీర్వదించాలన్న కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాలన్న ప్రతిపాదనపై సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అగ్ర నాయకుల సమక్షంలో అభ్యర్థుల పేర్లను ప్రకటించడం ద్వారా అసంతృప్తికి చెక్‌ పెట్టవచ్చన్న భావనతో కూడా అధినాయకత్వం ఉన్నట్టు చెబుతున్నారు. ఒక వేళ ఢిల్లిలో జాబితా ప్రకటిస్తే టికెట్‌ ఆశించి భంగపడ్డ ఆశావహులు గాంధీభవన్‌లో ఆందోళనలకు దిగడం, నాయకుల ఇళ్లకు వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తారని ఆలా కాకుండా సోనియా,రాహుల్‌ సమక్షంలో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే ఆశావహుల ఆందోళనను కొంత చల్లార్చ వచ్చని భావిస్తున్నట్టు సమాచారం.

సునీల్‌ కనుగోలు నివేదిక ఆధారంగానే ? కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రాజకీయ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు ఇచ్చిన సర్వే నివేదిక ఆధారంగానే జరుగుతుందని సమాచారం. కర్ణాటక అసెంబ్లి ఎన్నికల్లోనూ సునీల్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. ఐదు గ్యారెంటీ స్కీమ్‌లను ప్రకటించి వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సునీల్‌ కీలకంగా పనిచేశారు. తెలంగాణ లోనూ అయన రచించిన వ్యూహం ప్రకారమే ఎన్నికల బరిలోకి దిగాలని కాంగ్రెస్‌ అధినాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే పలు దఫాలు ఆయా నియోజకవర్గాల్లో సర్వేలు నిర్వహించిన సునీల్‌ బృందం విపక్ష పార్టీల అభ్యర్థులను ఎదుర్కునే ధీటైన అభ్యుర్థులెవరన్నది ఆయన కాంగ్రెస్‌ పెద్దలకు వివరించారు. స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్‌ తోనూ సమావేశమైన సునీల్‌ నియోజక వర్గాల వారీగా అభ్యర్థులెవరైతే బగుంటుంది,తమ సర్వేల్లో వచ్చిన ఫలితాలను వివరించడంతో పాటు ఆయనకు రహస్య నివేదికను అందజేసినట్టు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement