Sunday, April 28, 2024

Adilabad – పచ్చని వనంలో అగ్గి – బూడిదవుతున్నా అటవీ శాఖ చోద్యం

అందాల‌కు నెల‌వైన ప‌చ్చ‌ని అడ‌వులు మంట‌ల్లో బుగ్గి అవుతున్నాయి. చిన్న‌పాటి నిప్పు ర‌వ్వ ఎండిన ఆకుల‌ను ర‌గిలించి.. మంట‌లు పుట్టిస్తోంది. దీంతో గాలి వాలుకు ఆ అగ్గిర‌వ్వ‌లు అడ‌విని భ‌గ్గుమ‌నిపిస్తున్నాయి. ఆదిలాబాద్ అడవులను కార్చిచ్చు కమ్మేస్తోంది. అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అసలే వేసవి ఆపై దట్టంగా ఆకురాలి ఉండడంతో నిప్పుకు తోడవుతున్నాయి. భగభగ మండుతున్న ఎండలకు తోడు చెలరేగుతున్న మంటలకు విలువైన అటవీ సంపద బుగ్గిపాలు అవుతోంది. మంటల్లో ప‌డి వన్యప్రాణులు చ‌నిపోతున్నాయి. అడవుల్లో క‌ళ్లెదుటే అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నా అటవీశాఖ అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదు. నివార‌ణ‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు.

ఆంధ్రప్రభ, ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో: ప‌చ్చ‌ని అడ‌వుల్లో కార్చిచ్చు రేగుతోంది. ఆక‌తాయిత‌న‌మో.. కావాల‌నే చేస్తున్నారో కానీ, అడ‌వుల్లో నిప్పు ర‌వ్వ‌లు మంట‌లు పుట్టిస్తున్నాయి. ఇది ఇటు విలువైన అట‌వీ సంప‌ద‌ను.. అటు వ‌న్య‌ప్రాణుల‌కు పెనుముప్పుగా మారుతోంది. ఆదిలాబాద్ జిల్లా ప‌రిధిలోని ఆదిలాబాద్, ఇచ్చోడ డిఆవిజన్ పరిధిలో మరోవైపు జన్నారం వైల్డ్ లైఫ్ అటవీ ప్రాంతాల్లో ప్రతినిత్యం మంటలు చెల‌రేగి విలువైన అటవీ సంపద కాలి బూడిద‌వుతోంది. కిలోమీటర్ల కొద్దీ వ్యాపిస్తున్న కార్చిచ్చులో వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. జన్నారం కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోనూ రహదారి వెంట అటవీ ప్రాంతంలో ప్రతిరోజు మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ వేసవిలోనే ఆదిలాబాద్, మావల, గుడిహత్నూర్, ఇచ్చోడ నేరడిగొండ, బోత్, నిర్మల్ అటవీ రేంజ్ పరిధిలో కార్చిచ్చు అలజడి రేపుతోంది..

- Advertisement -

వన్యప్రాణులు విలవిల

నాలుగు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతం ఉంది. అడవుల్లో జింకలు, కుందేళ్ళు, నెమళ్ళు, నీలుగాయిలు, అడవి పందులతో పాటు ఇతర జంతువులకు ఈ వేసవిలో ముప్పు వాటిల్లుతోంది. అడవుల్లో రాజుకుంటున్న కార్చిచ్చు రెండు మూడు కిలోమీటర్ల వరకు వ్యాపిస్తాయి. రాత్రి వేళల్లో ఒక్కోసారి 10 కిలోమీటర్ల మేర అడవులు మంటలతో కాలిపోతున్నాయి. ఈ కార్చిచ్చు వ‌ణ్య ప్రాణుల మ‌నుగ‌డ‌కు ముప్ప క‌లిగిస్తోంది.

చింతగూడ, దంపుర్ అడవుల్లో మంటలు

రెండు రోజులుగా ఆదిలాబాద్ అటవీ డివిజన్ పరిధిలోని ఇచ్చోడ గుడిహత్నూర్ రేంజ్ ప‌రిసర ప్రాంతాల్లోని చింత గూఢ, దంపూర్, ధరమడుగు అటవీ ప్రాంతాల్లో 8 కిలోమీటర్ల మేర దట్టమైన అడవుల్లో మంటలు వ్యాపించాయి. బుధవారం అర్ధరాత్రి వరకు దారి పొడవునా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. విలువైన టేకు చెట్లు కాలి బూడిదయ్యాయి. వంట చెరుకు కోసం అడవికి వెళ్లి కట్టెలు తెచ్చుకునే సామాన్య పేదలపై కేసులు నమోదు చేసే అధికారులు, అటవీ సిబ్బంది వేసవిలో అడవుల కార్చిచ్చుపై నియంత్రణ చర్యలు తీసుకోవ‌డంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

జాగ్ర‌త్త ప‌డ‌ని అట‌వీశాఖ‌

రాలిన ఆకులను ప్రత్యేక యంత్రాలతో ఫైర్ లైన్స్ (బాటలు) ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కాల్చివేయాల్సిన అటవీ సిబ్బంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. వేసవిలోనే మానవ తప్పిదాలతో లేదా అగ్గిరాజుకొని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వీటిపై స్పందించి చర్యలు తీసుకోకపోతే అటవీ సంపద కనుమరుగయ్యే అవకాశం ఉంది.

కార్చిచ్చుపై చ‌ర్య‌లు తీసుకుంటాం – ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఆదిలాబాద్ డీఎఫ్ఓ

ఆదిలాబాద్ జిల్లాలో ఈ వేసవిలో అక్కడక్కడ అడవుల్లో మంటలు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. సంబంధిత సిబ్బందికి ఇదివరకే మెమో జారీ చేశాం. ఇచ్చోడ గుడియత్నూరు అటవీ అధికారులను అలర్ట్ చేశాo. చిన్న నిప్పుతో కూడా మంటలు చెలరేగుతున్నాయి. ఈ విషయంలో ప్రజలు ముఖ్యంగా రైతులు తమ పంట చేనులో ఎండిన పత్తి కర్రలను కాల్చివేసే క్రమంలో రాత్రివేళ అడవులకు అంటుకుంటున్నాయి. చింతగూడ , దంపూర్ లో జరిగిన కార్చిచ్చుపై పకడ్బందీ చర్యలు తీసుకుంటాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement