Monday, April 29, 2024

Adilabad – దోబూచులాట! మబ్బుల మాటున సూరీడు

చిరుజల్లులతో అటవీ ప్రాంతాల్లో సాంత్వన
చల్లటి గాలులతో సేదతీరుతున్న జనం
ఆదిలాబాదులో ఆహ్లాదకర వాతావరణం
21.2 డిగ్రీల‌ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
తొమ్మిది డిగ్రీలు తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు

ఆంధ్ర‌ప్ర‌భ‌, ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో: ప్రచండ భానుడి నిప్పుల సెగలతో మొన్నటి వరకు కుతకుతలాడిన ఆదిలాబాద్ జిల్లా జనం ఇప్పుడు చిరుజల్లులు, తేలికపాటి వర్షాలు, మనసును హాయి గొలుపే శీతల గాలులతో సేద తీరుతున్నారు. మోడువారిన అడవులన్నీ కొత్త చిగురును సంతరించుకొని పచ్చదనంతో నిండుగా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చెర, ఖండాల, జోడేన్ ఘాట్ అటవీ లోయలు పచ్చదనంతో పరవశించిపోతున్నాయి. పక్షుల కిలకిలారావాలతో అటవీ ప్రాంతాలు కొత్త కలను సంతరించుకున్నాయి. సరిహద్దు మహారాష్ట్రలో ఉపరితల ఆవర్తనం సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తున కేంద్రీకృతం కావడంతో అనూహ్యంగా వాతావరణంలో మార్పులు సంభవించి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మూడు రోజులు కిందట నిప్పులు కక్కిన సూరీడు.. మబ్బుల మాటున దాక్కొని చిన్న బోయాడు.

- Advertisement -

21.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత..

ఆదిలాబాద్ జిల్లాలో మూడు రోజుల కిందట 44 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వాతావరణంలో వచ్చిన మార్పులతో శనివారం పగటి ఉష్ణోగ్రత 34 డిగ్రీలకు పడిపోయింది. దట్టంగా కమ్ముకున్న మేఘాలతో మధ్యాహ్నం 12.30 గంటల వరకు భానుడు బయటకురాని పరిస్థితి నెలకొంది. ఈదురుగాలులతో ఆదిలాబాద్, ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతమంతా మరో కాశ్మీరాన్ని తలపిస్తోంది. మూడు రోజులుగా చల్లటి వాతావరణం నేపథ్యంలో ఏసీలు, కూలర్ల చప్పు ల్లు ఆగిపోయాయి. శనివారం మధ్యాహ్నం పగటి ఉష్ణోగ్రత 34 డిగ్రీలు నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 21.2 డిగ్రీలు నమోదయ్యాయి.

తేలికపాటి జల్లులు..

ఉదయం, రాత్రి పూట కురుస్తున్న చిరుజల్లులు, తేలికపాటి వర్షాలు, అతిశీతల పవనాలతో ప్రజలు కాస్త ఊరట పొందుతున్నారు. ఏప్రిల్​లో ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం కొత్త అనుభూతి కలిగిస్తోందని, పశు పక్షాదులకు చల్లటి వాతావరణం పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతుందని, తాగునీటి కొరత నుండి ఉపశమనం లభిస్తోందని ప్రకృతి పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. మొన్నటివరకు కనిపించకుండా పోయిన ఊర పిచ్చుకలు, చిలుకలకు ఆహారంతో పాటు జీవవైవిధ్యంతో అలరిస్తున్నాయి. మరో మూడు రోజులపాటు కనిష్ట ఉష్ణోగ్రతలు ఇదే విధంగా ఉంటాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement