Wednesday, May 1, 2024

త‌డిసిన ధాన్యం గోవిందా…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : అకాల వర్షాలు ఈ ఏడాది రైతాం గాన్ని నిలువునా ముంచేశాయి. తీవ్రమైన పంటనష్టంతో ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రకృతి ప్రకోపంతో కోత కోసి కుప్పలేసిన ధాన్యమంతా బలమైన ఈదురు గాలులు, దంచికొట్టిన వడగండ్ల వానలకు చెల్లాచెదురై కొట్టుకుపోయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 20 లక్షల క్వింటాళ్ళ ధాన్యం మొలకెత్తి నేలపాలు కావడం చూస్తుంటే రైతలు గుండె తరుక్కు పోతోంది. బాధితులందరినీ ఆదుకుంటామనీ, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామనీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఆ దిశగా అధికార యంత్రాంగం చర్యలకు పూనుకునే లోపే కుప్పలు పోసిన ధాన్యం మొలకెత్తిపోయింది. అమ్మకోవడం మాట అటుంచి.. కోళ్ళ ఫారాల అవసరాలు తీర్చే నూకల కోసం మిల్లింగ్‌ చేద్ధామన్నా, పనికి రాకుండా పోయింది. రైతు సంఘాల ద్వారా అందిన సమాచారం మేరకు 16 జిల్లాల్లో తడిసిన ధాన్యం 50 లక్షల క్వింటాళ్ళకు పైమాటే. అయితే, కొన్ని ప్రాంతాల్లో రైతులు అప్రమత్తమై త్వరితగతిన ఆరపోసి కొంత కాపాడుకున్నారు. వరుసగా వారం, పది రోజులపాటు ఎడతెరిపి లేకుండా అకాల వర్షాలు కురిసిన అనేక ప్రాంతాల్లో ఆ అవకాశం లేకుండా పోయింది.

ఉమ్మడి కరీంనగర్‌, నల్గొండ, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లోనే అత్యధిక నష్టం జరిగినట్లు ఆయా జిల్లాల నుంచి అందిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఒకవైపు మొలకెత్తిన ధాన్యం భూజుపట్టి పాడైతే, మరోవైపు లక్షలాది ఎకరాల్లో కోత దశలో నేలకొరిగిన వరి పంట కూడా అమ్ముకోవడం సాధ్యం కాదని రైతులు ఆవేదన చెందుతున్నారు. నేలకొరిగి నీళ్ళల్లో మునిగిన పంటంతా కోతకు ముందే మొలకలొచ్చింది. ఈ క్రమంలో కోలుకోలేని దెబ్బతో బాదిత రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పదహారు జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా జరిగినట్లు అధికారుల సర్వేలోనూ గుర్తించారు. కానీ కొనుగోళ్ళ ప్రక్రియకు ఒకవైపు ఎఫ్‌సీఐ నిబంధనలు, మరోవైపు ఆగని వర్షాలు తీవ్ర ఆటంకం కలిగించాయి. దీంతో ప్రభుత్వ కొనుగోళ్ళు ప్రారంభం కాకముందే ధాన్యం పాడైపోయింది. మిగతా జిల్లాల్లోనూ రైతులకు తప్పని పాక్షిక నష్టం సంభవించింది. రోడ్డెక్కి ఆందోళన చేసినా, ఫలితం దక్కకపోవడంతో లక్షలాది మంది బడుగు రైతులు మానసిక వేదనకు గురవుతున్నారు.

ఆదర బాదరాగా సర్వేలు, అధికారుల తప్పిదాలు
ప్రభుత్వం పంట నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని ప్రకటించింది. మార్చి మాసానికి సంబంధించిన పంట నష్టం జాబితాను ఉమ్మడి జిల్లా నుంచి పంపిన అధికారులు ఇటీ-వల కురిసిన వర్షం పంట నష్టం సేకరణకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. మార్చి నెలలో జరిగిన పరిశీలనలో క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు పప్పులో కాలు వేశారు. బోధన్‌ డివిజన్‌ లో జరిగిన పంట నష్టంలో రైతు వరి పంట వేస్తే రికార్డులో మాత్రం సన్‌ ప్లnవర్‌ సాగు చేశారని రాయడంతో రైతు పూర్తి వివరాలను తెలపడంతో అగ్రిక్చలర్‌ అధికారులు నాలుక కర్చుకున్నారు. కొత్తగా జరుగుతున్న పంట నష్టం వివరాలను ఇప్పటికీ ప్రకటించకపోవడం, ప్రభుత్వం 30 శాతం నిబంధన, కౌలు రైతులకు పరిహారం దక్కదన్న బాధ రైతులను వేధిస్తోంది.

ఉద్యాన పంటలకూ కోలుకోలేని దెబ్బ
ఈ అవాంతరాలన్నీ దాటు-కొని పండించిన పంటలను భారీ వానలు ముంచెత్తాయి. ఈదురుగాలులు, వడగండ్ల దాడితో లక్షలాది ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలు నీటి పాలయ్యాయి. చేతికొచ్చిన పంట కళ్ల ముందే తడిసి ముద్దవడంతో అన్నదాతల గుండె చెరువైంది. ఈ వేసవిలో కాలం కాని కాలంలో విడతలు విడతల్లో కురిసిన వర్షాలు పైర్లను ఆగమాగం చేశాయి. గడచిన 25 రోజుల్లో పడ్డ వానలకు పొలాల్లోని పంటలు దెబ్బతినడం ఒక ఎత్తుకాగా కల్లాల్లో కోసి ఆరబెట్టిన, చివరికి మార్కెట్‌ యార్డుల్లో ఆరబోసిన వరి ధాన్యం, మొక్కజొన్న, మిరప, పసుపు, పత్తి, వేరుశనగ పంటలు వానలకు నానడం మరో ఎత్తు. అక్కడక్కడ మొలకలు సైతం వచ్చాయి.

- Advertisement -

అదుపు చూసి మిల్లర్ల దెబ్బ
ఏప్రిల్‌, మే నెలల్లో దాదాపు 25 రోజుల పాటు కురిసిన అకాల వర్షంతో పంటలు దెబ్బతినడంతో పాటు- కోసిన వరి ధాన్యం కల్లాలలో, రోడ్లపై, కొనుగోలు కేంద్రాల వద్ద తడిసి ముద్దయిన విషయం తెలిసిందే. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించారు. నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ తదితర జిల్లాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఈ నెల 7న బీష్మించిన మిల్లర్లు ఆయా జిల్లాల కలెక్టర్లతో జరిగిన సమావేశం నేపథ్యంలో సీఎంఆర్‌ లోడింగ్‌కు అంగీకరించిన విషయం తెలిసిందే. తడిసిన ధాన్యం తీసుకున్న, ఎఫ్‌సీఐ నిబంధనల నేపథ్యంలో తమకు గిట్టు-బాటు- కాదని గతంలో ప్రకటించినట్లు- బస్తాకు మూడు నాలుగు కిలోల నూకకు అనుమతి ఇవ్వాలని కోరిన విషయం తెల్సిందే.

బాయిల్‌ మిల్లర్లకు సర్ధుబాటు యోచనలో కొర్రీలు
తడిసిన ధాన్యం విషయంలో ప్రత్యేకంగా సంబంధిత ధాన్యాన్ని తీసుకురావాలని సివిల్‌ సప్లయ్‌ శాఖ రైతులను కోరారు. కానీ కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని తేమ కలిగిన ధాన్యాన్ని కలిపి లోడింగ్‌ చేయడంతో మిల్లర్లు వాటిని అన్‌లోడింగ్‌ చేయడానికి కొర్రీలు పెట్టారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని ప్రత్యేకంగా బాయిల్‌ మిల్లర్లకు ఇచ్చి సర్ధుబాటు- చేయాలని యోచన కాగా అది సాధ్యం కాకుండా పోయింది. అందుకు సోసైటీ-లే ప్రధాన కారణమని చెప్పాలి. ఈ నేపథ్యంలో తడిసిన ధాన్యం విషయంలో తేమ కోసం రైతులు ఇప్పటికి వాటిని ఎండకు ఆరబోసి ఎదురు చూస్తున్నారు.

జరిగిన నష్టంలో 25శాతమే రికార్డు?
ఆయా జిల్లాల్లో వాస్తవానికి జరిగిన పంట నష్టంలో సరాసరిగా కేవలం 25శాతం మాత్రం రికార్డుకెక్కినట్లు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఉదాహరణగా ఒన్ని సంఘటనలను పరిశీలిస్తే, ఏప్రిల్‌, మే మాసాల్లో నిజామాబాద్‌ జిల్లాలో 31, 567 ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో 63 వేల ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు- అధికారులు అంచనా వేశారు. కానీ అక్కడ లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని రైతు సంఘాలు సాక్షాలు చూపుతున్నాయి. అందులో 30 శాతానికి మించి పంట నష్టపోయిన వారికి మాత్రమే పరిహారం ఇస్తామని ప్రకటించడంతో ఆ నిధులు ఎప్పుడు వస్తాయని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మార్చి నెలకు సంబంధించిన కేవలం 467 ఎకరాల పంట నష్టాలకు 46 లక్షల పరిహారం మంజూరు కాగా రైతుల ఖాతాలో నమోదుకు అధికారులు ఏర్పాట్లు- చేశారు. గత 25 రోజులుగా కురిసిన అకాల వర్షంతో ప్రధానంగా వరి పంటకు తీవ్ర నష్టం జరుగడంతో కోత కోసి నూర్పిడి చేసిన చేతికి రాని పంట పరిస్థితులు ఉన్నాయి.

ఒక్క డిచ్‌పల్లిలోనే 5వేల ఎకరాలు నష్టం
పంట నష్టం అంచనాలకు మచ్చుతునకలా.. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం కొరట్‌ పల్లిలో సుమారు 5వేల ఎకరాల్లో పంట ఒక్క విత్తు కూడా చేతికి రాకుండా పోయింది. అలాంటి ప్రాంతాల్లో నష్టపరిహారం వస్తుంది కానీ మిగిలిన ప్రాంతాల్లో అగ్రికల్చర్‌ అధికారులు గ్రామీణ స్థాయిలో ఏఈవోల ద్వారా చేసిన సర్వేలలో తమ నష్టపరిధిలోకి తమ పేరు వచ్చిందో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో లక్ష ఎకరాల్లో పంట నష్టాలు జరుగగా సుమారుగా 15 లక్షల ఎకరాల్లో వరి వంగిపోయింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారుల తుది జాబితా కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అందిస్తామన్న రూ.10 వేల పరిహారం ఏ మూలకు సరిపోదని ఎంతో కొంత వస్తుందని ఆశపడితే 30 శాతం నిబంధన రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

నష్టపరిహారం అరకొర పంపిణీతో రైతుల్లో ఆందోళన
అరకొర నష్టపరిహారం పంపిణీతో రైతుల్లో ఆందోళన నానాటికీ పెరుగుతోంది. ఉద్యానవన పంటలు మామిడి, అరటి, బొప్పాయి, బత్తాయి తోటలు దెబ్బ తిన్నాయి. 16 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. పంట నష్టం భారీగా ఉంటు-ందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. విపత్తుల వలన పంటలు నష్టపోయిన రైతులకు ఎప్పటిదప్పుడే పరిహారం చెల్లిస్తామంటోంది రాష్ట్ర సర్కారు. ఆ విధంగా అరకొర పంపిణీ చేస్తోంది. కాగా మార్చిలో కురిసిన వానల నష్టం అంచనాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ లోపు ఏప్రిల్‌ 23 నుంచి రాష్ట్రంలో ఎక్కడో అక్కడ వానలు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మూడు రోజుల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించిన ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ, అధికార యంత్రాంగంలో చలనం తక్కువై ఆ విధానం ఎలాగో స్పష్టత ఇవ్వలేదు.

గతానికి భిన్నంగా నష్టం అంచనాలో వింత విధానం
గతంలో విపత్తులొచ్చిన వెంటనే అధికారులు ఏయే పంటలు ఎంతెంత విస్తీర్ణంలో ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో ప్రాథమిక అంచనాలు వెల్లడించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇ-క్రాప్‌లో నమోదు చేసిన పంటలు నష్టపోతేనే పరిహారం ఇస్తున్నందున, అంత వరకే నష్టం జరిగిందంటు-న్నారు. మిగతా నష్టాలను కనీసం పరిగణనలోకి తీసుకోవట్లేదు. కౌలు రైతుల పంట పొలాలు మునిగినా అవి ఇ-క్రాప్‌లో నమోదు కావట్లేదు కనుక ఆ నష్టాలను వదిలేస్తున్నారు. ఎన్యూమరేషన్‌లో పారదర్శకత పాటించకుండా లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యేంత వరకు సమాచారం గుంభనంగా ఉంచుతున్నారు. నష్టాల వివరాలు రహస్యంగా ఉంచాలని ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి తాఖీదులిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement