Saturday, April 20, 2024

బెంగాల్లో చివరి విడుత పోలింగ్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా  చివరిదైన ఎనిమిదో విడత పోలింగ్ గురువారం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగనున్నది.  ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 35 నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 283 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ దఫా మొత్తం 84 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కను వినియోగించుకోనున్నారు. ప్రముఖ నటుడు, బీజేపీ నేత మిథున్​ చక్రవర్తి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు లేకుంటే పోలింగ్ కేంద్రాలకు అనుమతించడం లేదు. ప్రతి పోలింగ్ కేంద్రంలో శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. ఓటర్లు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.

గతంలో జరిగిన హింసాత్మక సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేసింది. గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘం సున్నితమైన ప్రాంతంగా గుర్తించిన బీర్భుమ్‌ జిల్లాలో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది.  294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‌ లో ఎనిమిది విడుతల్లో ఈసీ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. ఇప్పటికే ఏడు విడుతల్లో 259 నియోజకవర్గాల పరిధిలో ఓటింగ్‌ పూర్తయింది. మిగతా 35 స్థానాలకు పోలింగ్‌ జరుగుతుండగా.. 283 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా, మే2న బెంగాల్ తో పాటు కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement