Friday, April 26, 2024

ప్లైయింగ్ సాస‌ర్ లా భారీ మేఘం.. వైర‌ల్ గా వీడియో

ఆకాశంలో పెద్ద ప్లైయింగ్ సాస‌ర్ క‌నిపించ‌డంతో ట‌ర్కీలోని బుర్సా వాసులు ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. గ్రహాంతరవాసులు నేలపైకి వస్తున్నారేమోనని చాలామంది భయాందోళనకు లోనయ్యారు. కాసేపటి తర్వాత ఆకాశంలో కనిపిస్తున్నది గ్రహాంతరవాసులు ఉపయోగించే ఫ్లైయింగ్ సాసర్ కాదని తేలిపోయింది. ఓ భారీ మేఘం ఇలా విచిత్రమైన ఆకారందాల్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కొంతమంది ఈ వింతను తమ కెమెరాలలో బంధించారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో.. ఇప్పుడు అవి వైరల్ గా మారాయి. ఆకాశంలో ఈ వింత మేఘాలు ఏర్పడడంపై తుర్కియే మెటరలాజికల్ సంస్థ ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఇలాంటి మేఘాలు 2 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తున్న పర్వత ప్రాంతాల్లో మాత్రమే ఏర్పడతాయని చెప్పారు. ఎత్తైన ప్రదేశాల్లో గాలుల వేగం క్షణక్షణానికీ మారుతుందని, బలమైన గాలులు వీస్తూన్నప్పుడు ఉన్నట్టుండి ప్రశాంతత నెలకొంటుందని చెప్పారు. గాలి వేగంలో చోటుచేసుకునే అసాధారణ మార్పులవల్లే ఇలాంటి అసాధారణ మేఘాలు ఏర్పడతాయని వివరించారు. ఈ మేఘాలు కనిపించాయంటే ఆ రోజు లేదా ఆ మరుసటి రోజు వర్షం కురుస్తుందని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement