Sunday, May 5, 2024

పాల‌క‌మండ‌లి భేటీలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న టీటీడీ

టీటీడీ పాలక మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ప్రాధాన్యత ఇవ్వనుంది. ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాల బ్రేక్‌ దర్శనాల సమయంలో మార్పు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రేక్‌ దర్శనాలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు చైర్మన్‌ సుబ్బారెడ్డి వెల్లడించారు. బ్రహ్మోత్సవాల అనంతరం టైమ్‌స్లాట్‌ టోకెన్లు, సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని వివరించారు. ప్రాథమికంగా రోజుకు 20వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లు జారీజేస్తామని పేర్కొన్నారు.

రూ.95 కోట్లతో యాత్రికుల వసతి సముదాయాల నిర్మాణం, రూ. 30కోట్లతో చెర్లోపల్లి నుంచి వకుళామాత ఆలయం వరకు రోడ్డు నిర్మాణం చేపడుతామని తెలిపారు. శ్రీవారి ప్రసాదాల తయారీకి సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే వినియోగించాలని నిర్ణయించామన్నారు. రూ.2.45 కోట్లతో నందకం అతిథి గృహంలో ఫర్నిచర్‌, రూ.3కోట్లతో నెల్లూరులో కల్యాణ మండపాల దగ్గర ఆలయ నిర్మాణం ఏర్పాటు చేస్తామన్నారు. టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. ఇక సామాన్య భక్తులకు కూడా టీటీడీ శుభవార్త చెప్పింది. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ పునరుద్ధరించాలని నిర్ణయించింది. పొరటాసి మాసం అనంతరం తిరుపతిలో భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఎలాంటి టోకెన్లు, టిక్కెట్లు లేకపోయినా భక్తులను సర్వదర్శనం అనుమతించే విధానం యథావిధిగా కొనసాగుతుందని టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement