Tuesday, April 23, 2024

TS – న‌మ్మ‌కంపై న‌క‌రాలు! మేడారంపై నింద‌లు

జాత‌ర క‌మ‌ర్షియ‌ల్ అయ్యిందా?
సోష‌ల్ మీడియాలో ప‌లు వాద‌న‌లు
గిరిజ‌నులు, జాన‌ప‌దుల విశ్వాసం ఏమిటీ
ఆచారాల‌ను దెబ్బ‌తీసే య‌త్నాలు జ‌రుగుతున్నాయా?
సంస్కృతి, సంప్ర‌దాయాల్లో మార్పు వ‌చ్చిందా
వీఐపీల పేరుతో విప‌రీత పోక‌డ‌లే దీనికి కార‌ణ‌మా
సామాన్య భ‌క్తుల తీరులో క‌నిపించ‌ని మార్పు

మేడారం జాతర విషయంలో.. జాతర ప్రక్రియలో గిరిజన సంస్కృతీ, ఆచార, సాంప్రదాయాల్లో ఇప్పటి వరకు ఏమాత్రం మార్పు రాలేదు. కాకపొతే, అప్రహతిహారంగా పెరుగుతున్న భక్తుల సంఖ్యను సొమ్ము చేసుకునేందుకు దేవాదాయ శాఖ ఇక్కడ కొన్ని చ‌ర్చ‌లు చేప‌ట్టింది. అంటే, ఏమాత్రం రూపం లేని గద్దెల వద్ద అమ్మవార్ల బొమ్మలు పెట్టడం, గద్దెల ప్రాంగణం చుట్టూ హిందూ దేవాలయాల మాదిరిగా నిర్మాణాలను చేయడం.. సమ్మక్క సారలమ్మ ప్రసాదాలను ప్రవేశ పెట్టడం.. సామాన్య భక్తులకు ఏమాత్రం అనుకూలంగా లేకుండా వీఐపీలకు దర్శనంలో ప్రాధాన్యం ఉండేలా తీసుకున్న చర్యల‌తో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇలా గిరిజన సాంప్రాదాయ ఆనవాళ్లు దూరం చేసే కొన్ని ప్ర‌క్రియ‌లు క్రమక్రమంగా ప్రారంభమయ్యాయి. కానీ, ఆదివాసీ గిరిజనులు తమ సాంప్రదాయాన్ని వీడ‌లేదు. య‌థాప్రకారం ఆదివాసీల ఆచారం ప్రకారంగానే సమ్మక్క, సారలమ్మ, పడిగిద్ద రాజు, గోవిందరాజులను వనం నుండి గద్దెల వ‌రకు తేవడంలోనే నిజమైన ఆదివాసీ సంస్కృతీ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ, ఇవి మిన‌హాయించి.. మిగితా చ‌ర్య‌ల్లో మాత్రం కాస్త కమర్షియల్ అయ్యాయనే వాద‌న‌లున్నాయి. అలాంటి విమ‌ర్శ‌ల‌కు చేప‌డుతున్న చ‌ర్య‌లు కొంత బ‌లం చేకూరుతున్న‌ట్టే అనిపిస్తుంది.

భ‌క్తుల‌కు ఏర్పాట్లు.. త‌ద్వారా ఆదాయం..

ప్రధానంగా కోటికి పైగా భక్తులు, ప్రధానంగా గ్రామీణ గిరిజన, జానపదులు హాజరయ్యే మేడారం జాతరలోనూ ఈ భక్త జనానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంటుంది. దీనికి అక్కడే ఉన్న ప్రభుత్వ స్థలాలు వేలం వెయ్యడం, వేల సంఖ్యలో బాటరీ ఆఫ్ టాప్స్, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలను ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుంది. కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా, మేడారంలో చిన్న చిన్న భూములను షాపింగ్ కాంలెక్స్‌గా మార్చి వాటిని వేలం వేస్తారు. ఈ ఖాళీ స్థలాలను వేలం వెయ్యడం ద్వారా ఏర్పాట్లకు తగు నిధులను పొందుతున్నారు.

ఆచారం మ‌రువ‌ని సామాన్యులు..

- Advertisement -

అయితే.. సమ్మక్క సారలమ్మ గద్దెల దర్శనానికి ప్రత్యేక టికెట్లను పెట్టినా, వీవీఐపీ దర్శనాలను ఏర్పాటు చేసినా మేడారానికి వచ్చే కోటికి పైగా భక్తుల్లో 95శాతం ఎంత కష్టమైనా.. ఎంత బరువైనా.. తమ నిలువెత్తు బంగారాన్నినెత్తిపై మోస్తూ క్యూ లైన్ల ద్వారానే దర్శనం చేసుకోవడం ఈ జాతర ప్రత్యేకతగా చెప్పవచ్చు. గిరిజన సంస్కృతికి దూరం అవుతున్నామని, హిందుత్వ విధానాలను గిరిజన సంస్కృతిలో కలుపుతున్నారని, కమర్షియల్‌గా ఈ జాతరను చేస్తున్నారని విమర్శలు వచ్చినప్పటికీ.. సామాన్య గిరిజన, జానపదులు మాత్రం ఇవేమీ లెక్క చేయ‌డం లేదు.

సుదూర ప్ర‌యాణం.. జంప‌న్న వాగులో స్నానాలు..

ఎంత కష్టమైనా సుదీర్ఘ దూరమునుంచి ప్రయాణం చేసి జంపన్న వాగులో స్నానాలు చేసి లైన్లలో గంటల కొద్దీ నిలబడే అమ్మవార్ల‌ను దర్శనం చేసుకొని తమ మొక్కులను సమర్పించుకుంటారు. అంతే కానీ, గిరిజన సంస్కృతీ, సాంప్రదాయాలకు మేడారం జాతర ఎప్పుడూ దూరం కాలేదు.. కాదు కూడా. ఎందుకంటే, గిరిజన పద్దతిలో జరుగుతుంది కాబట్టే. మేడారం జాతర అంటే అంత విశ్వాసం, నమ్మకం. అందుకే కోటి మంది నమ్మకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement