Saturday, April 20, 2024

Spl Story | కాంగ్రెస్‌తో కలిసొచ్చిన వొక్కలిగలు.. బీజేపీని దెబ్బకొట్టిన లింగాయత్‌లు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఒక ఘట్టం ముగిసింది. ఎన్నికల్లో గెలుపు కంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడుతున్న ఇద్దరు నేతల్లో ఎవరిని ఆ పీఠంపై కూర్చోబెట్టాలన్నదే కాంగ్రెస్ అధిష్టానానికి ఒక పెద్ద సవాలుగా మారింది. గెలుపు సంబరాలతో పాటు కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కసరత్తులో కాంగ్రెస్ బిజీగా ఉంటే.. బీజేపీ ఓటమి కారణాలను విశ్లేషించుకునే పనిలో పడింది. ఎన్నికల ఫలితాల కంటే ముందే ఒక రకంగా కమలనాథులు కర్ణాటకలో ఓటమికి అంగీకరించినట్టయింది.

– స్వరూప పొట్లపల్లి, ఆంధ్రప్రభ ఢిల్లీ బ్యూరో చీఫ్

క‌ర్నాట‌క ఎన్నిక‌ల ప్రచారం మొత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా జాతీయ నాయకత్వం తన భుజాలపై మోయాల్సి వచ్చిందంటేనే రాష్ట్రంలో నాయకత్వ లోపం, డొల్లతనం బయటపడింది. చివరి బంతి వరకు గెలుపు కోసం పోరాడిన చందంగా ‘భంజరంగీ’ అంశాన్ని తెరపైకి తెచ్చి భావోద్వేగాలతో గట్టెక్కాలని చూసినప్పటికీ నిరాశే ఎదురైంది. కనీసం కాంగ్రెస్‌తో పోటాపోటీగా సీట్లు సాధించినా పరువు నిలబడేది. కానీ సీట్లు, ఓట్ల శాతంలో కాంగ్రెస్ కంటే చాలా వెనుకబడింది. కమలనాథులకు ఇది కేవలం పరాజయం మాత్రమే కాదు, ఘోర పరాభవం అనుకుంటే తప్ప వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తప్పులు దిద్దుకుని ప్రజల తీర్పు కోరడం సాధ్యపడదు.

ఎవరి బలం.. ఎవరికి వరం?
గత ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోయినా అత్యధిక స్థానాల్లో గెలుపొందిన పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలబడింది. అప్పటికే ఐదేళ్ల పాటు పూర్తి పదవీకాలం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్యపై ప్రజల్లో వ్యతిరేకత లేనప్పటికీ ఆ పార్టీ కలసికట్టుగా పనిచేయకపోవడం వల్ల ఓడిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 104 స్థానాల్లో గెలుపొందిన బీజేపీకి 36.35% శాతం ఓట్లు రాగా 80 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ 38.14% ఓట్లు సాధించింది. అంటే తమ కంటే 24 సీట్లు ఎక్కువ గెలిచిన బీజేపీ కంటే కాంగ్రెస్‌కు 1.79% ఓట్లు అధికంగానే వచ్చాయి. ఈ ఎన్నికల్లో జనతాదళ్ (సెక్యులర్) 18.3% ఓట్లతో 37 స్థానాల్లో గెలుపొందింది.

- Advertisement -

తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం ప్రకారం చూస్తే పెద్దగా నష్టపోలేదు. దాదాపు 36% ఓట్లు ఆ పార్టీ నిలబెట్టుకోగలిగింది. కానీ కాంగ్రెస్ తన బలాన్ని 42.9% వరకు పెంచుకోగలిగింది. అదే సమయంలో జేడీ(ఎస్) బలం 13.3 శాతానికే పరిమితం అయింది. అంటే జేడీ(ఎస్) కోల్పోయిన 5 శాతం ఓట్లు కాంగ్రెస్‌కు అదనంగా వచ్చి చేరాయని స్పష్టమవుతోంది. ముక్కోణపు పోటీలో ఇలా అదనంగా కలిసొచ్చిన ప్రతి ఓటూ ఆ పార్టీకి తిరుగులేని మెజారిటీతో విజయాన్ని అందించింది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే రాష్ట్రంలో బలమైన సామాజికవర్గాల్లో ఒకటైన వొక్కలిగలు తమ సొంత పార్టీగా భావించే జేడీ(ఎస్) నుంచి దూరం జరిగి, కాంగ్రెస్‌కు దగ్గరయ్యారని ఈ ఓట్ల శాతం లెక్కలు చెబుతున్నాయి. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఆ వర్గానికి చెందిన నేత కావడం, కాంగ్రెస్‌ను గెలిపిస్తే తాను ముఖ్యమంత్రి అవుతానని ఆ వర్గంలో నమ్మకం కల్గించడం ఇందుకు దోహదం చేశాయి. మరోవైపు దేవెగౌడ కుటుంబ పార్టీగా ముద్ర పడ్డ జేడీ(ఎస్)లో ఆయన కుమారులు కుమారస్వామి, రేవణ్ణ మధ్య నెలకొన్న విబేధాలు కూడా వొక్కలిగలకు విసుగు తెప్పించాయి. పదవులన్నీ ఆ ఒక్క కుటుంబానికేనా అన్న భావన కూడా తోడైంది. చాలాకాలంగా ముఖ్యమంత్రి పదవిలో తమ వర్గం నేత లేడన్న అసహనంలో వొక్కలిగలు.. తమ ఓట్లన్నీ గంపగుత్తగా జేడీ(ఎస్)కు వేసినా సరే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని గ్రహించారు. అదే కాంగ్రెస్‌కు ఓటేస్తే.. అప్పటికే సీఎం అభ్యర్థి రేసులో ఉన్న డీకే శివకుమార్‌‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టవచ్చని భావించారు. అందుకే వొక్కలిగల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న 51 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 23 గెలుపొందింది. అలా ఇంతకాలం జేడీ(ఎస్) బలం అనుకున్న వొక్కలిగలు కాంగ్రెస్‌కు వరంగా మారారు.

బీజేపీ తప్పిదాలే కాంగ్రెస్‌కు కలిసొచ్చాయా?
జేడీ(ఎస్), కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కలహాల కాపురంగా మారి ఆ ప్రభుత్వం పతనమైన తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచే బీజేపీ విమర్శలు ఎదుర్కొంటోంది. యడ్యూరప్ప సీఎంగా ఉన్నంత కాలం ఆయన కుమారుడి జోక్యం ప్రభుత్వ వ్యవహారాల్లో ఎక్కువగా ఉందన్న విమర్శలు ఎదురయ్యాయి. జోక్యంతో పాటు అవినీతి ఆరోపణలు కూడా తీవ్రస్థాయిలో వచ్చాయి. గరిష్ట వయోపరిమితి సాకు చూపుతూ యడ్యూరప్పను సీఎం కుర్చీ నుంచి దించి, అదే సామాజికవర్గానికి చెందిన బస్వరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. లింగాయత్‌లకు ఆరాధ్య దైవంగా, కుల పెద్దగా ఉన్న యడ్యూరప్పను దించేయడాన్ని లింగాయత్‌లు జీర్ణించుకోలేకపోయారు. కర్ణాటకలో యడ్యూరప్ప లేకపోతే బీజేపీ లేదన్న సంగతి తెలిసిందే. ఒకసారి యడ్యూరప్పను దూరం చేసుకుని ఫలితం అనుభవించిన పార్టీ, ఈసారి దూరం చేసుకోకపోయినా పదవి నుంచి తొలగించడం ద్వారా లింగాయత్‌ల మనసు గాయపర్చింది. ఫలితంగా లింగాయత్‌లు ఆధిపత్యాన్ని ప్రదర్శించే 69 నియోజకవర్గాల్లో బీజేపీ ఈసారి కేవలం 20 స్థానాలకే పరిమితమైంది. ఇక్కడ కాంగ్రెస్ 43 స్థానాల్లో గెలుపొందిందంటేనే లింగాయత్‌లు బీజేపీని ఎంతగా దెబ్బకొట్టారో అర్థమవుతోంది.

కర్ణాటకలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అందరి చూపు లింగాయత్‌ల మీదే ఉంటుంది. కన్నడ నాట ముఖ్యంగా ఉత్తర కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాల్లో లింగాయత్‌లు ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లోని 13 జిల్లాల్లో దాదాపు 90 నియోజక వర్గాల్లో గెలుపోటములను నిర్ణయిస్తున్నది ఈ వర్గమే. గత రెండు దశాబ్దాలుగా ఈ వర్గం భారతీయ జనతా పార్టీ వెంట నిలిచింది. గత ఎన్నికల్లోనూ వారి మద్ధతుతోనే బీజేపీ ఈ ప్రాంతంలో 52 సీట్లను గెలుపొంది ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అలాంటి లింగాయత్‌లు యడ్యూరప్ప విషయంలో బీజేపీ అధిష్టానం వ్యవహరించిన తీరుతో తీవ్రంగా కలత చెందారు. ఇది యావత్ తమ సమాజానికి ఎదురైన అవమానంగా, పరాభవంగా భావించారు. ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత వీర శైవ లింగాయత్ ఫోరం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు పలుకుతున్నట్టు లేఖ విడుదల చేసింది. దీంతో ఖంగు తిన్న బీజీపీ నేతలు వారిని ప్రసన్నం చేసుకోవడానికి నానారకాలుగా ప్రయత్నించారు. అయినా సరే ఫలితం లేకపోయింది. రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్న లింగాయత్ లకే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ నాయకత్వం హామీ ఇవ్వకపోవడం, ఎన్నికల ఫలితాల తర్వాతే సీఎం ఎవరనేది చెబుతామని వ్యాఖ్యానించడం కూడా ఆ సామాజిక వర్గాన్ని కమలం గుర్తుకు దూరం చేసింది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో బొమ్మై పాలనలో అడుగడుగునా అవినీతి ముద్ర పడింది. కాంట్రాక్టర్స్ అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించి మరీ సర్కారు ప్రతి పనిలో 40 శాతం కమిషన్ అడుగుతోందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. దీన్ని కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మలచుకుంది. ’40 శాతం కమిషన్ సర్కార్’ నినాదంతో పాటు పేటీఎం తరహాలో ‘పే-సీఎం’ పోస్టర్లతో హోరెత్తించింది. లంచం తీసుకుంటూ బీజేపీ నేతలు కెమేరా కళ్లకు చిక్కిన ఘటనలు కూడా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని, చాలా చోట్ల బీజేపీ కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది. అయినా సరే ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.

బడుగు, బలహీనవర్గాల్లో హస్తానిదే ఆధిపత్యం
దళితులు, మైనారిటీలతో పాటు గిరిజన, ఆదివాసీలు కాంగ్రెస్ పార్టీకి చెక్కుచెదరని ఓటుబ్యాంకుగా ఉండేవాళ్లు. కానీ దేశంలో ఆ పరిస్థితి మారింది. ప్రాంతీయ పార్టీల హవా పెరిగిన తర్వాత ఈ వర్గాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీ వెంట నిలబడుతున్నాయి. అయితే కర్ణాటకలో పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఈసారి ఎన్నికల్లో షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) రిజర్వుడు నియోజకవర్గాల్లో అత్యధిక సీట్లలో కాంగ్రెస్ పాగా వేసింది. అలాగే షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) రిజర్వుడు స్థానాలతో పాటు దళిత ఓట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో సైతం కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది. మాజీ సీఎం సిద్ధరామయ్యకు బడుగు, బలహీనవర్గాల్లో ఉన్న ఆదరణ, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఈ వర్గాలను కాంగ్రెస్ వైపు నిలబడేలా చేశాయి. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ యాత్రలో భాగంగా కర్ణాటకలో పర్యటించిన 51 నియోజకవర్గాల్లో అత్యధిక సీట్లలో గెలుపొందినట్టు ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. వీటన్నింటికీ తోడు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే 5 ప్రధాన హామీల మేనిఫెస్టో కూడా కాంగ్రెస్ విజయావకాశాలను గణనీయంగా పెంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement