Sunday, May 12, 2024

పల్లెలే ఆదుకొన్నయ్! : సీఎంఈఐ సర్వే వెల్లడి

కరోనా వచ్చి వేలాది ఉద్యోగాలను లాగేసింది. లక్షల మంది ఉపాధిని కొల్లగొట్టింది. అయితే, పల్లెలే మనకు రక్షణగా నిలిచాయి. 2021లో నిరుద్యోగం, ఉపాధి లేమితో పట్టణాలు బిక్కుబిక్కుమంటే, పల్లెల్లో కావాల్సినంత పని దొరికింది. కొవిడ్ రెండో వేవ్ తర్వాత గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి రంగంపై సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సర్వే నిర్వహించగా పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2021లో అక్టోబర్ మినహా మిగిలిన 11 నెలల్లో గ్రామాలతో పోల్చితే పట్టణాల్లో నిరుద్యోగం అధికంగా నమోదైంది. పట్టణాల్లో ఆసక్తి, నైపుణ్యాలున్నా పని దొరకలేదు. గ్రామాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. వానలు బాగా పడి కాలం కావడంతో వ్యవసాయ పనులు పుష్కలంగా లభించాయి. దీనికితోడు ఉపాధిహామీ పథకం, ప్రభుత్వాలు చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లభించాయి.
రాష్ట్రంలో మెరుగైన ఉపాధి అవకాశాలు :
కరోనా రెండో వేవ్ తర్వాత తెలంగాణ 2.2 శాతంతో అతితక్కువ నిరుద్యోగం ఉన్న ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. విస్తారంగా వర్షాలు పడడమే కాకుండా ప్రభుత్వం నిర్మించిన నీటి పారుదల ప్రాజక్టులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగటం దీనికి ప్రధాన కారణం. స్వయం ఉపాధికి తగిన ప్రోత్సాహం అందించటం కూడా పల్లెల్లో ఉపాధి అవకాశాలు పెరగడానికి దోహదపడింది. అయితే హర్యానా, రాజస్థాన్ లో నిరుద్యోగం భారీగా పెరిగింది. ఇక గత ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా నిరుద్యోగం రికార్డు స్థాయిలో 11.84 శాతానికి చేరుకొన్నది. డిసెంబర్ లో 7.91 శాతానికి చేరింది. ఆ నెలలో దాదాపు 85 లక్షల మంది పనుల కోసం పట్టణాలకు వలస వెళ్లగా 40 లక్షల మందికే పని దొరికింది. ఎక్కువగా అసంఘటిత రంగంపై కరోనా ప్రభావం చూపింది..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement