Thursday, May 16, 2024

తెలంగాణలో నాణ్యమైన వైద్యం.. 115 దవాఖానలకు క్వాలిటీ సర్టిఫికెట్లు

తెలంగాణ ప్రభుత్వ దవాఖానల్లో పరిశుభ్రత పాటిస్తున్నారు. వైద్యంలో నాణ్యత ఉన్నది. సిబ్బందికి మంచి శిక్షణ ఇస్తున్నారు. క్లినికల్‌ ప్రొసీజర్‌ ఫాలో అవుతున్నారు. ప్రసూతి గదులు బాగున్నాయి. అన్ని రకాల వైద్య పరికరాలున్నాయి. అత్యాధునిక యంత్రాలూ ఉన్నాయి. 365 ప్రమాణాలు పాటిస్తున్నారు.. దేశంలోని దవాఖానల్లో ప్రమాణాలను పరిశీలించే నేషనల్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ రిసోర్స్‌ సెంటర్‌ ఇచ్చిన స్కోరింగ్‌లో తేలిన అంశాలివి! ఈ స్కోరింగ్‌ ఆధారంగానే రాష్ట్రంలోని 115 దవాఖానలకు ఎన్‌క్వాస్‌ (క్వాలిటీ)సర్టిఫికెట్లు జారీ చేసింది. అందులో ఐదు జిల్లా దవాఖానలు కూడా ఉన్నాయి.

‘రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు పెరిగాయి. నాణ్యమైన వైద్యం అందుతున్నది. అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి. దవాఖానల పరిసరాల్లో పరిశుభ్రత పెరిగింది’.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ రిసోర్స్‌ సెంటర్‌(ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్సీ) చెప్పిన నిజాలివి. ఓపీ, ఐపీ, సర్జికల్‌.. ఇలా ప్రతీ విభాగాల్లో దవాఖానల నాణ్యత భేష్‌ అంటూ నేషనల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌ ముద్ర వేసి మరీ ధ్రువీకరించింది. ప్రభుత్వ దవాఖానల్లో నాణ్యత ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించి క్వాలిటీ సర్టిఫికెట్‌ ఇచ్చే ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్సీ.. రాష్ట్రంలోని 115 దవాఖానలకు ఎన్‌క్వాస్‌ సర్టిఫికెట్లు ఇచ్చింది. ఇందులో 5 జిల్లా దవాఖానలు ఉన్నాయి. ఇది దేశంలోనే అత్యధికం. రాష్ట్రంలోని 129 దవాఖానలను ఎన్‌క్వాస్‌ నిబంధనలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఇందులో ఇప్పటికే 122 దవాఖానల్లో పరిశీలన పూర్తయింది. 115 దవాఖానలకు సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. మరో ఏడు దవాఖానల ఫలితాలను వెల్లడించాల్సి ఉన్నది. మరో ఏడు దవాఖానలను ఈ నెలలో లేదా వచ్చే నెలలో తనిఖీ చేయనున్నారు.

ఏమిటీ ఎన్‌క్వాస్‌?

ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్సీ.. ప్రభుత్వ దవాఖానల్లో ఒక్కో విభాగంలో ఉండాల్సిన నాణ్యత ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఈ ప్రమాణాలనే ‘నేషనల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌’ అని పిలుస్తారు. ఎన్‌క్వాస్‌ కోసం రాష్ర్టాలు దరఖాస్తు చేసుకొంటే.. ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్సీ బృందం వచ్చి క్షుణ్ణంగా పరిశీలించి సర్టిఫికెట్‌ ఇస్తుంది. ఈ సర్టిఫికెట్‌కు మూడేండ్ల వ్యాలిడిటీ ఉంటుంది. ఎన్‌క్వాస్‌ తరహాలోనే ప్రసూతి గదుల నాణ్యతను పరీక్షించేందుకు కేంద్రం ‘లక్ష్య’ పేరుతో ప్రమాణాలను నిర్దేశించింది. ఇందులో లేబర్‌ రూమ్‌, మెటర్నిటీ ఆపరేషన్‌ థియేటర్‌ను పరీక్షిస్తారు. 70 శాతం స్కోర్‌ దాటితే సర్టిఫికెట్‌ ఇస్తారు. ‘కాయకల్ప కార్యక్రమం కింద.. హాస్పిటల్‌ లోపల, ఆవరణలో, చుట్టుపక్కల పరిసరాల్లో పరిశుభ్రతను అధ్యయనం చేసి అవార్డులు ఇస్తారు.

వందల ప్రమాణాలు

- Advertisement -

ఎన్‌క్వాస్‌ సర్టిఫికెట్‌ పొందాలంటే దవాఖానలు అనేక ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. జిల్లా దవాఖాన, ఏరియా దవాఖానల్లో 18 చెక్‌లిస్ట్‌లు ఉంటాయి. అంటే మొత్తం 18 విభాగాలను పరిశీలిస్తారు. మళ్లీ ఒక్కో డిపార్ట్‌మెంట్‌లో వాళ్లు ఎలాంటి సర్వీస్‌ ఇస్తున్నారు?, సిబ్బంది శిక్షణ, సపోర్ట్‌ సర్వీసెస్‌, క్లినికల్‌ ప్రొసీజర్‌ ఫాలో అవుతున్నారా? ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌, నిబంధన ప్రకారం క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ పాటిస్తున్నారా? వంటి ఎనిమిది అంశాలను అధ్యయనం చేస్తారు. మొత్తంగా జిల్లా దవాఖాన, ఏరియా దవాఖానలకు 365 ప్రమాణాలను నిర్దేశిస్తారు. సీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల్లో 12 విభాగాలను, పీహెచ్‌సీల్లో 6 విభాగాలను పరిశీలిస్తారు. నిర్దేశించిన ప్రమాణాల్లో ఎన్ని పాటిస్తున్నారో గుర్తించి స్కోర్‌ ఇస్తారు. కనీసం 70 శాతం స్కోర్‌ దాటితేనే క్వాలిటీ సర్టిఫికెట్‌ మంజూరు చేస్తారు. సర్జరీకి వాడే కత్తి పొడవు ఎంత ఉండాలి? ఎంత ఉన్నదో కూడా కొలిచి పరీక్షిస్తారంటే తనిఖీ ఎంత లోతుగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

అమలు కోసం ప్రత్యేక వ్యవస్థ

ఎన్‌క్వాస్‌, లక్ష్య, కాయకల్ప పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణకు ఒక ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ను, జిల్లా స్థాయిలో క్వాలిటీ అష్యూరెన్స్‌ మేనేజర్లను నియమించింది. వారు దవాఖానల్లో పరిస్థితిని అంచనా వేసి సూచనలు ఇస్తారు.

వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదటి నుంచీ రాష్ట్రంలో వైద్యరంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ దవాఖానల చేతిలో నలిగిపోతున్న పేదలను ఆదుకొనేందుకు ప్రభుత్వ దవాఖానల్లో వసతులు పెంచాలని నిర్ణయించారు. ఏటికేడు బడ్జెట్‌లో నిధులు పెంచుతూ వస్తున్నారు. గతేడాది రూ.6 వేల కోట్లు కేటాయించగా, ఈసారి ఏకంగా రూ.11 వేల కోట్లకు పెంచారు. పారిశుద్ధ్యం, సిబ్బంది సంఖ్య, సేవలు, పరికరాల కొనుగోలు ఇలా.. పీహెచ్‌సీ స్థాయి నుంచి సూపర్‌ స్పెషాలిటీ వరకు అన్ని రకాల వసతులను కల్పించారు. ఏడేండ్లలో ప్రభుత్వం రూ.350 కోట్ల విలువ చేసే 30 వేలకుపైగా పరికరాలను సమకూర్చింది. వీటి నిర్వహణకు ఇటీవలే ప్రత్యేక పాలసీని అమలు చేసింది. జిల్లా కేంద్రాల్లోనూ క్యాథ్‌ల్యాబ్‌, సీటీస్కాన్‌ వంటి సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రిగా హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత వైద్య సేవల్లో వేగం మరింత పెరిగింది. నిరంతర పర్యవేక్షణ, జిల్లాల్లో పర్యటనలు, సమీక్షలు, అవసరమైన నిధుల విడుదలతో ప్రభుత్వ దవాఖానలకు ఆదరణ పెరిగింది.

సర్టిఫికెట్లు వచ్చినవి

జిల్లా దవాఖనలు :5

ఏరియా హాస్పిటళ్లు :3

యూపీహెచ్‌సీ :8

పీహెచ్‌సీ :99

Advertisement

తాజా వార్తలు

Advertisement