Friday, July 26, 2024

రెమ్డెసివిర్ పై తమిళనాడు కీలక నిర్ణయం!

కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ రెమ్‌డెసివిర్‌ ఔషధం కోసం భారీ డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ఈ ఇంజక్షన్‌ లభించే కేంద్రాల వద్ద కొవిడ్‌ బాధిత బంధువులు వందల సంఖ్యలో బారులు తీరుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని ఇక నుంచి నేరుగా ప్రైవేటు ఆసుపత్రులకే విక్రయిస్తామని ప్రకటించింది. ఇందుకు మే 18 నుంచి ప్రత్యేక వెబ్‌ సైట్‌ అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. రాష్ట్రంలో కొవిడ్‌ ఉద్ధృతి, రెమ్‌డెసివిర్‌ ఔషధం కోసం బాధితులు ఇక్కట్లపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి స్టాలిన్‌, తాజా నిర్ణయం తీసుకున్నారు.

కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు వైద్యులు రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని సిఫార్సు చేస్తున్నారు. దీంతో ఈ ఔషధం కొరత ఏర్పడడంతో పాటు, ఇవి లభించే చోట కొవిడ్‌ బాధిత బంధువులు వందల సంఖ్యలో గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా కొందరు వీటిని బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం ఇక నుంచి నేరుగా ప్రైవేటు ఆసుపత్రులకే రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని విక్రయిస్తామని స్పష్టంచేసింది. ఆసుపత్రులు తమకు అవసరమైన ఇంజక్షన్‌లను ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని.. కేవలం ఆసుపత్రికి సంబంధిత వ్యక్తి మాత్రమే విక్రయ కేంద్రం నుంచి తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. అంతేకాకుండా వీటిని అవసరమైన రోగులకే అందించడంతో పాటు ప్రభుత్వం వద్ద కొన్న ధరకే రోగులకు ఇచ్చేలా అధికారుల పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తమిళనాడు ప్రభుత్వం హెచ్చరించింది.

ప్రస్తుతం ఈ ఔషధాన్ని అక్కడి ప్రభుత్వ ఆసుపత్రులకు తమిళనాడు మెడికల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ ద్వారా అందిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మాత్రం చెన్నై, కోయంబత్తూర్‌, సాలెం, తిరుచిరాయ్‌పల్లి, మధురై, తిరునల్వేలి వంటి నగరాల్లో ప్రత్యేక కేంద్రాల ద్వారా నేరుగా విక్రయిస్తున్నారు. దీంతో ఆయా కేంద్రాల వద్ద భారీ రద్దీ ఏర్పడుతుండడంతో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి: కరోనా కొత్త లక్షణాలు ఇవే..

Advertisement

తాజా వార్తలు

Advertisement